Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ధోనీ మ్యాజిక్ : ఫైనల్లోకి చెన్నై

ధోనీ మ్యాజిక్ : ఫైనల్లోకి చెన్నై

చెన్నైసూపర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి తన ఆటతీరుతో  విమర్శకుల నోళ్లు మూయించాడు.  11 బంతుల్లో 24 పరుగులు కావాల్సిన దశలో బరిలోకి దిగిన ధోనీ కేవలం ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 18 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి తానేంటో మరోసారి నిరూపించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ బ్యాట్స్ మెన్ లో  ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో విఫలమై కేవలం ఏడు పరుగులకే వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఘోరంగా విఫలమయ్యాడు, ఎనిమిది బంతులాడి కేవలం ఒక పరుగు మాత్రమే చేసి హజెల్ వుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  ఆ తర్వాత ఢిల్లీ కెప్టెన్ పంత్, బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసి అక్సర్ పటేల్ పంపాడు, పటేల్ కూడా 11 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్ పృథ్వీ షా సొగసైన షాట్లతో స్కోరు బోర్డును పరిగెత్తిస్తుంటే అతనికి సహచరుల నుంచి సహకారం కరువైంది. 34 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్ల తో 60  పరుగులు చేసి షా ఔటయ్యాడు. ఆ తర్వాత  కెప్టెన్ రిషబ్ పంత్, హెట్మెయిర్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 37)  కూడా ధాటిగా ఆడారు. పంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు,  రెండు సిక్సర్లతో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 స్కోరు చేసింది. చెన్నై బౌలర్లలో హజెల్ వుడ్ కు-2,  జడేజా, బ్రావో,  మొయిన్ అలీ తలా ఒక వికెట్ సాధించారు.

173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. డూప్లెసిస్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నార్త్జ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.  ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రాబిన్ ఊతప్ప ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ లు రెండో వికెట్ కు 110 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఊతప్ప-63 (44బంతులు, 7 ఫోర్లు, 2సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యాడు, తర్వాత అంబటి రాయుడు కేవలం ఒక పరుగుమాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మొయిన్ ఆలీ, రుతురాజ్ కు జత కలిసి ఐదో వికెట్ కు 30 పరుగులు చేశారు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లతో 70 పరుగులు చేసిన గైక్వాడ్ 19వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన ధోనీ తన మ్యాజిక్ ఆట తీరుతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రుతురాజ్ గైక్వాడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో తొమ్మిదోసారి చెన్నై ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటివరకూ ఎనిమిది సార్లు ఫైనల్ ఆది మూడుసార్లు టైటిల్ గెల్చుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్