ఐపీఎల్ ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఏడు వికెట్లతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో విజయానికి ఐదు పరుగులు కావాల్సిన దశలో బెంగుళూరు ఆటగాడు శ్రీకర్ భరత్ చివరి బంతిని సిక్సర్ గా మలిచి అపూర్వ విజయాన్ని అందించాడు. 52 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లతో 78 పరుగులు చేసిన శ్రీకర్ భరత్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ తొలి వికెట్ కు 88 పరుగులు జోడించారు. ధావన్ 35 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం కాసేపటికే 31 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన పృథ్వీ కూడా ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్-18, హెట్మెయిర్-29 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా యజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్, డ్యాన్ క్రిస్టియన్ తలా ఒక వికెట్ సాధించారు.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరుకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పడిక్కల్ ఇద్దరూ ఈ మ్యాచ్ లో విఫలమయ్యారు. మొదటి ఓవర్లోనే నార్జే బౌలింగ్ లో పడిక్కల్ డకౌట్ అయ్యాడు. మూడో ఓవర్లో విరాట్ కోహ్లీని కూడా నార్జే ఔట్ చేసి బెంగుళూరుని కోలుకోలేని దెబ్బ తీశాడు. శ్రీకర్ భరత్, ఏబీ డివిలియర్స్ ఇన్నింగ్స్ చక్కదిద్ది మూడో వికెట్ కు 49 పరుగులు సాధించారు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 26 పరుగులు చేసిన డివిలియర్స్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత గ్లెన్ మాక్స్ వెల్ తో కలిసి శ్రీకర్ భరత్ మరో వికెట్ నష్ట పోకుండా ఇన్నింగ్స్ కొనసాగించారు. ఐతే ఢిల్లీ బౌలర్ నర్జే 19 ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. దీనితో చివరి ఓవర్లో 15 పరుగులు బెంగుళూరుకు కావాల్సి వచ్చింది. శ్రీకర్ చివరి బంతికి సిక్సర్ తో విజయం అందించి ఢిల్లీ గెలుపు ఆశలపై నీళ్ళు జల్లాడు. కాగా, ఆడిన 14 మ్యాచ్ లో 10 విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. రేపు ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ తలపడనుంది.