మొదటి నుంచి కూడా నాగార్జున కొత్త దర్శకులకు అవకాశాలనిస్తూ … ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఆయన సినిమాల ద్వారా పరిచయమైన సాంకేతిక నిపుణులు … ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అలా తన తాజా చిత్రం ‘నా సామిరంగ’ ద్వారా కూడా ఆయన విజయ్ బిన్నీకి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో నిర్వహించారు.
ఈ సినిమాకి సంగీతాన్ని కీరవాణి సమకూర్చగా, సాహిత్యాన్ని చంద్రబోస్ అందించారు. ఆ ఇద్దరినీ నాగార్జున ప్రత్యేకంగా స్టేజ్ పైకి ఆహ్వానించారు. కీరవాణిగారు .. చంద్రబోస్ గారు ఈ సినిమాకి పనిచేయడం ఈ సినిమా చేసుకున్న అదృష్టమనీ, ఆ ఇద్దరినీ స్టేజ్ పైకి ఆహ్వానించడం తనకి గౌరవమని అన్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలంటే, కేవలం 3 నెలల్లో తాము ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను పూర్తిచేయవలసి ఉందనీ, చేయగలమా లేదా అనే సందేహంలో ఉన్నప్పుడు, చేయగలరని మా నాన్నగారు చెప్పినట్టు అనిపించిందని అన్నారు.
“అలా నాన్నగారు ఇచ్చిన ధైర్యంతోనే ఈ సినిమాను మొదలుపెట్టామనీ, ముందుగా అనుకున్నట్టుగానే 3 నెలల్లో ఈ సినిమాను పూర్తి చేశామని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన థియేటర్స్ కి తీసుకొస్తున్నామనీ, నిజానికి 3 నెలల్లో సినిమా చేయడమంటే అది అంత ఆషామాషీ విషయమేం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం తాము పడిన కష్టం గురించి సక్సెస్ మీట్లో చెబుతాననీ, 3 నెలల్లో ఒక సినిమాను తీయడం ఎలా? అనే టాపిక్ పై ఒక బుక్ కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నామని చెప్పారు.