Less Language: మనసులో ఏక కాలంలో అనేక ఆలోచనలు పొంగిపొర్లి మనో వేగంతో ప్రవహిస్తున్నా…ప్రసరిస్తున్నా…అది వాగ్రూపంలో నోటినుండి బయటికి వస్తున్నప్పుడు మాత్రం ఒక పద్ధతి ఉంటుంది. ఒక ఆలోచనకు సంబంధించిన అంశాన్ని మాత్రమే నోరు మాట్లాడగలుగుతుంది. మెదడులో ఆలోచన మాటగా మారి మనం వినే వాక్కు కావడానికి నాలుగు దశలున్నాయి.
1. పరా
2. పశ్యంతి
3. మధ్యమా
4. వైఖరి
అంటే మాట్లాడాలని ఇలా అనుకోగానే అలా మాట్లాడుతున్నట్లు మనకు అనిపిస్తున్నా…
1. మెదడు/మనసు (పరా)
2. ఊపిరితిత్తులు (పశ్యంతి)
3. స్వరతంత్రులు (మధ్యమా)
4. నోరు (వైఖరి)
మన శరీరంలో ఆటోమేటిగ్గా జరిగే ఈ నాలుగింటి సమన్వయంతో మాట్లాడగలుగుతున్నాం. ఇంతా చేస్తే ఆ మాట్లాడే భాష నియమాలను, ఉచ్చారణ పద్ధతులను, యాసను చిన్నప్పుడు మూడు నాలుగేళ్లలోపు మెదడు రికార్డ్ చేసుకుని…ఆపై జీవితాంతం అదే పద్ధతిలో అందిస్తూ ఉంటుంది.
నోటి మాట అక్షారాలా గాలి. ఊపిరితిత్తులనుండి వెలువడే గాలి స్వరతంత్రులను తాకి ధ్వనిగా మారుతుంది. ఆ ధ్వనులకు లిపి అక్షరాలు సంకేతాలు. ఆ లిపి పరిణామ క్రమం పెద్ద సబ్జెక్ట్.
తెలుగు అక్షారాలది అందానికే ముద్దొచ్చే అందం.
తెలుగు వర్ణమాలలో ఒక్కొక్క అక్షరాన్ని అమ్మవారి అలంకారాల్లో దర్శించిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి రచన ఇది. నాకు తెలిసినంతవరకు తెలుగు వర్ణమాల మీద ఇంత గొప్ప పాట మరొకటి లేదు.
“అద్దమంటి “అ” “ఆ” లు అమ్మవారి చెక్కిళ్ళు;
తల్లి బుగ్గ నిమిరినట్లు దిద్దుతారు పిల్లవాళ్ళు
ఆమె చేతిలోని చిలుక “ఇ”
ఇంకొకచేతి జపమాల “ఈ”
జ్ఞానమొసగు పుస్తకాలు “ఉ” “ఊ” లు
హంసవాహనాలు “ఋ” “ౠ” లు
“ఌ” “ౡ” “ఎ” “ఏ” “ఐ” “ఒ ” “ఓ ” ఔ ” ముంగురులు
వీణా శృతులే “అం” “అః”
తెలితామర పీఠమే “ఱ”
పాదాలకు పారాణి “ళ”
వొంకుల వడ్డాణమే “ణ”
వజ్రపుటుంగరమే “క్ష”
“య” “ర” “ల” “వ” “లు” “శ” “ష” “స” “హ” లు పాదాలకు మువ్వలు
“ఙ” “ఞ” “న్” ” ం” చిరు సవ్వడులు
చెవులకు రవ్వల దుద్దులు “థ” “ధ”
తన ముంగిట జయ గంట “ఢ”
ముత్యపు ముక్కుపోగు “ట”
నవ్వినపుడు బుగ్గ సొట్ట “ఠ”
గాజుల గల గల లే “చ” ” “ఛ” “జ” “” “ఝ”
వన్నెల అరవంకీలె “డ” “ద”
సువర్ణ కిరీటమే “గ”
సిగను విరియు మల్లె రెమ్మ “త”
సుందర సుధానదీ గమనమే “క”
పురివిప్పిన పెంపుడు నెమలి “ఖ”
జయ శంఖారవములే “ప” “ఫ” “బ” “భ”
నుదుట వెలుగు చంద్ర రేఖ “అరసున్న”
లోకంలో లిపిలేని భాషలెన్నో మన కళ్ల ముందే మట్టికొట్టుకుని పోయాయి. లిపి ఉండి…వాడక అంతరించిపోయిన భాషల గురించి కూడా బాధపడుతూనే ఉన్నాం.
తెలుగు భాష ఎప్పటికీ చావక పోవచ్చు కానీ…తెలుగు లిపి మనుగడ మాత్రం పెను ప్రమాదంలో ఉంది. ఇంకో వందేళ్లు, రెండు వందల ఏళ్ళయ్యాక…
భాష తెలుగు;
లిపి ఇంగ్లీషు అయ్యే అక్షర విషాదం కనపడుతోంది.
సినిమా పాటల లిరికల్ వీడియోల్లో తెలుగు సాహిత్యానికి తెలుగు అక్షరాలు పెట్టనే పెట్టరు.
కళ్లావి
కురులావి
కళ్లావతి
లాంటి తెలుగువారికి అర్థం కాని మాటలు వాడుతున్నప్పుడు ఇంగ్లీషు లిపిలో అఘోరిస్తున్నారంటే జాలిపడి వదిలేయవచ్చు.
“నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు…
….దయలేదా అసలు?”
అని హీరోయిన్ తొడల అందాన్ని మైమరచి సామజవరగమనాన్ని కాళ్లకు అతికించిన హీరోయిక్ తెలుగును-
“Nee kallanu pattukuni vadalanannavi chude na kallu…
Daysleda asalu?”
అని ఇంగ్లీషులో పెడితే ఇప్పటికి 24 కోట్ల మంది చూశారు. త్వరలో మరో పాతిక కోట్ల మంది ఎలాగూ చూడక తప్పని కాళ్లు అవి. అంత సంఖ్యలో తెలుగు మాట్లాడే ప్రజలే లేరు. అంటే ఉన్న పది కోట్ల మంది తెలుగు వారే పొద్దున సాయంత్రం ఆ కాళ్లను కళ్ళకద్దుకుంటూ చూస్తూ…వింటూ ఉండి ఉండాలి.
ఇక్కడ ఉన్నవి తెలుగు కాళ్లు. తెలుగు కళ్లు. చూసి తరించాల్సినవాళ్లు తెలుగువాళ్లు. ఇంగ్లీషు లిపి ఎందుకొచ్చింది? హీరోయిన్ కాలి గోటికి కూడా ఇంతోటి తెలుగు పనికిరానిదవుతోందా?
తెలుగు సినిమాలకు తోడుబోయినవారు యాడ్ ఏజెన్సీల వారు. తెలుగువారికోసం ప్రత్యేకించిన తెలుగు ప్రకటనల్లో ఎక్కడా తెలుగు కనపడకుండా, వినపడకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
“ఈరోజు మీరు కడుపుకు ఏమి తింటున్నారు?”
అని తెలుగులో అడిగితే మనం ఫీలవుతామని-
“Eeroju miru emi tintunnaru?”
అని తెలుగును ఇంగ్లీషులోనే ఇరికించి అడుగుతున్నారు.
ఇప్పటికిది ట్రెండీగా…డిజిటల్ అవసరంగానే ఉన్నా…
ఇవన్నీ మనకు మనం తుడిపేసుకుంటున్న అక్షరాలు.
అక్షరాలా చెరిపేసుకుంటున్న అక్షరాలు.
నవనవోన్మేషంగా బతికి ఉండగానే తెలుగు లిపికి కొరివి పెడుతున్న మనల్ను భగవంతుడు కూడా క్షమించడు.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :