Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిర్లిప్త భాష

నిర్లిప్త భాష

What a Language: మీడియా వాణిజ్య ప్రకటనల్లో భాష మొదట్లో బాగానే ఉండేది. తరువాత యాంత్రిక అనువాదం, మక్కికి మక్కి అనువాదం, కృతక అనువాదాలు మొదలయ్యాక భాష తెరమరుగయ్యింది. ఇప్పుడన్నీ అనువాద ప్రకటనలే. చివరికి తెలుగులో నేరుగా తయారయ్యే ప్రకటనలు కూడా మొదట ఇంగ్లీషులోనే అలోచించి…ఆపై తెలుగులోకి దించుతున్నారు. తెలుగును పొడిచి పొడిచి చంపి పాతి పెట్టేది తెలుగువారే. ఇన్నాళ్లూ అనువాదమే హత్యకు గురయ్యేది. ఇప్పుడు డిజిటల్ యుగంలో లిపి కూడా హత్యకు గురవుతోంది. హంతకులను ఈ విషయంలో అభినందించాలి. భాషను సగం చంపి కోమాలో ఐ సి యు స్ట్రెచర్ మీద ఏళ్లకు ఏళ్లు పెట్టి అనవసరంగా ఆసుపత్రులను పోషించడం కంటే…పొతే ఒకే సారి పాడె కట్టి…చితికి నిప్పు పెట్టి…చితా భస్మాన్ని స్మృతిపథంలో కలిపేసుకోవచ్చు.

వాణిజ్య ప్రకటనల్లో భాషను, లిపిని చంపేస్తున్నారని బాధపడుతున్నాం కానీ…డిజిటల్ విప్లవం వచ్చాక తెలుగు లిపిని వాడాల్సిన అవసరమే లేని విచిత్ర స్థితిలో ఉన్నాం.

మీరు గోళ్లు గిల్లుకుంటున్నారా? అని తెలుగులో అఘోరిస్తే అవమానం…దేశద్రోహ నేరం కింద శాశ్వతంగా జైల్లో పెడతారు కాబట్టి… Meeru gollu gillukuntunnara? అని ఇంగ్లీషు లిపిలోనే ఇష్టంగా, బాధ్యతగా రాస్తున్నాం. ఇది గుడ్డిలో మెల్ల అని ఆధునిక డిజిటల్ తరం అంగీకరించింది. ఇంతకంటే ఘోరం- ఏ లిపి అవసరమే లేని ఇమోజి పాతరాతి యుగం బొమ్మల భాష.

నమస్కారం-????

ఓకే-????

బాగుంది-????

అభినందనలు-????

భలే తమాషాగా చెప్పారు-????

ఏడ్చినట్లుంది- ????

ఇంకా చాలా ఉన్నాయి కానీ…సభా మర్యాద దృష్ట్యా అన్నీ చెప్పడం కుదరదు.

తెలుగు వర్ణమాలలో ఉన్న అక్షరాలనే సరిగ్గా వాడక కొన్ని అక్షరాలు తమను తామే రద్దు చేసుకుని శాశ్వతంగా నామరూపాల్లేకుండా పోయాయి. భాషకు వేల ఏళ్ల ఆయుస్సును, శాశ్వతత్వాన్ని ఇచ్చేది లిపి ఒక్కటే. లిపిలేని తుళు లాంటి భాషల గతి ఏమిటో మన పొరుగున మంగళూరు తీరం వెంబడి చూస్తున్నాం.

తెలుగు లిపి ఫాంట్ వాడుక ఇదివరకు ముద్రణలో మాత్రమే అవసరం ఉండేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతివాడూ నన్నయ తిక్కన పోతనలకు అక్షరాలు నేర్పగలిగినవాళ్లే. తెలుగు ఇంగ్లీష్ కలగలిసిన సరికొత్త లిపి తెంగ్లీష్ లో వాడు రాసిందే తెలుగు. ఫాంట్ ఒకప్పుడు పెద్ద తతంగం. ఇప్పుడు ఇంగ్లీషు అక్షరాల్లో టైపు చేస్తే తెలుగు అక్షరాలు వచ్చే డిజిటల్ అవసరాల ఫాంట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ డిజిటల్ తెలుగు లిపిలో అక్షరాలకు అక్షరాలా అవమానం జరుగుతోంది. అక్షరాల ఊపిరి ఆగిపోతోంది. ఆ అక్షరాలను ఎలా పలకాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియక భాష మూగబోతోంది.

ఉదాహరణకు ఒక రోజు పత్రికల్లో వచ్చిన తెలుగు ప్రకటనల్లో తెలుగు భాషను, లిపిని, భావాన్ని గమనించండి.

హౌజాట్!

Telugu Lipi

తినే తిండిలో వెజ్, నాన్ వెజ్ గురించి మాత్రమే నాకు తెలుసు. నాన్ వెజ్ ప్రకటనగా ఫోటోలు చెబుతున్నా…కనిపించిన ప్రతి అక్షరాన్ని చదివే అలవాటున్న నాకు హౌజాట్! అని కనిపించగానే మొదట కళ్లు బైర్లు కమ్మాయి. తరువాత ఆ మాట అర్థం కాక తల తిరిగింది. పొద్దుటినుండి సాయంత్రం దాకా కనిపించిన ప్రతివారినీ అర్థం చెప్పాలని అడుక్కుంటే…చెయ్ ఖాళీ లేదు…ముందుకు పొమ్మన్నారు. చివరకు ఒక చిన్నపిల్లాడు పెద్ద మనసు చేసుకుని నన్ను కాపాడాడు. How is that! అనే మూడు ఇంగ్లీషు పదాలను కలిపి…ట్రెండీగా howzat! అని అంటున్నారట. తెలుగే అక్షరమక్షరం కలుపుకుని చదువుకునే నాలాంటి వారిని ఈ ప్రకటనలు చాలా ఘోరంగా అవమానిస్తున్నాయి. తెలుగు పత్రికలు చదివేవారికి తప్పనిసరిగా ఆక్స్ ఫర్డ్ స్థాయి ఇంగ్లీషు జ్ఞానం కూడా ఉండి తీరాలని నియమం పెట్టాలి. తెలుగు పత్రికలవారే తెలుగు పాఠకులకు అపరిమిత ఇంగ్లీషు జ్ఞానం కోసం ఉచిత ప్రాథమిక నిర్బంధ ఆంగ్ల విద్యా బోధన మొదలు పెట్టాలి.

అజ్ఞానానికి అంతు లేదు!


పేరు మాంగళ్య. ప్రకటన భాషలో అంతా సంకరం. అమంగళం. తెలుగు ప్రకటనలో తాటికాయంత అక్షరాల్లో…
“హ్యాపీనెస్ కి హద్దు లేదు
డిస్కౌంట్స్ కి అంతు లేదు”
ఈ మంగళానికి తెలుగు ఆనందం దొరకదు. ఇంగ్లీషు హ్యాపీనెస్ లోనే ఏడవాల్సి వచ్చింది. అంతులేని తెలుగు భాషా డిస్కౌంట్ తో ఈ బట్టలను తెలుగువారే కొంటున్నారు. ఇది సమకాలీన భాషా అమంగళ దేవతా వస్త్రం కథ. తీరని వ్యథ.

తెలుగు ఎక్స్ చేంజ్ కాలేదా?
Telugu Lipi
కారు కొనండి. అమ్మండి. లేదా ఎక్స్ చేంజ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ కారును తెలుగులోకి మార్చుకోవద్దు. ఇంగ్లీషులోనే long drive కు వెళ్లండి. బహుశా ఇది ఫ్రాన్స్ దేశపు కారు. తొలిసారి భారత మార్కెట్లోకి వచ్చింది. అందువల్ల కారులో కూర్చున్నప్పుడు పొరపాటున కూడా తెలుగు మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడితే ఇంజిన్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది! మామూలు ప్రమాదాలకే ఇన్సూరెన్స్ వాడు లక్ష కారణాలు చెప్పి క్లెయిమ్ రాదు పొమ్మంటాడు. అలాంటిది భాషా సంబంధిత ప్రమాదాలకు అస్సలు ఏమీ రాదు! ఇదొక విదేశీ భాషా ఆధిపత్య ధోరణి కారు అయి ఉంటుంది. ఈ కారుకు తెలుగుకు చుక్కెదురు!

బట్టలేదు…అన్నీ వేర్ లే!


కళాంజలి తెలుగు ప్రకటనలో మహిళలకు బట్టలు దొరకవు. లేడీస్ వేర్ లు మాత్రం ఉన్నాయి. మిగతా వస్త్ర దుకాణాల తెలుగు ప్రకటనల్లో మగవారికి తెలుగు పదాల బట్టలు/గుడ్డలు/వస్త్రాలే లేవు. ఎత్నిక్, టెంపుల్ ఏంఠిక్, మెన్స్ వేర్ లు మాత్రమే ఉన్నాయి.

పుట్టినపుడు బట్టలేదు…
పోయేప్పుడు బట్టలేదు…
నడుమ బట్ట కట్ట నగుబాటు కాదొకో?
అని వేమన బట్టలు వేసుకోకపోయినా…తన అసాధారణమయిన పద్యాలతో తెలుగు భాషకు అనన్యసామాన్యమయిన బట్టలను కప్పాడు.

Telugu Lipi

తెలుగు ప్రకటనల్లో ఇంగ్లీషు “వేర్” లు ఊడలు దిగి తెలుగు విలువల వలువలు చించి అవతల పారేస్తున్నాయి.

మన అశ్రద్ధ, నిర్లక్ష్యం ఇలాగే దిన దిన ప్రవర్ధమానమవుతూ ఉంటే…ఏదో ఒకనాటికి తెలుగు లిపిలేని భాషగా మిగిలిపోతుంది.

రుత్విక్, ఎత్నిక్, ఎంఠిక్, స్పుత్నిక్ ఛమకా ఛమా ఉగాది కిడ్స్ వేర్ కావాలా? ఆర్ డు యూ వాంట్ మెన్స్ వేర్? అదర్ వైజ్ హద్దులేని హ్యాపీ నెస్ కే ముద్దొచ్చే లేడీస్ వేర్ కావాలా?
హౌజాట్???

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి: 

ధీర చోరులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్