ప్రభుత్వం ఎన్నో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, వీటిని అర్ధం చేసుకోలేకపోవడం వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. సంస్కరణలను అర్ధం చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని, కానీ వాటి ఫలితాలు వచ్చిన తరువాత వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుస్తాయని అన్నారు. సంస్కరణలు చేయని వారిని నిందించాలని, కానీ వాటిని అమలు చేస్తున్న వారిపైన విమర్శలు చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. అయితే ఇది సహజమని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన ఈ సందర్భంగా జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
75 ఏళ్ళ రాష్ట్ర సంపదను హైదరాబాద్ లో పెట్టుబడిగా పెట్టామని, అనేక సంస్థలు వచ్చాయని… అందుకే తెలంగాణా వారికి ఆశ కలిగిందని..అందువల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందన్నారు ధర్మాన. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో డబ్బులు పెట్టాక వారు వెళ్లిపొమ్మంటే ఏమి చేయాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి విశాఖ మధ్యలో లేదని కొందరు అంటున్నారని, చెన్నై, కోల్ కతా, ముంబై నగరాలు ఆయా రాష్ట్రాలకు మధ్యలో ఉన్నాయా అని ధర్మాన నిలదీశారు. విశాఖలో 500 ఎకరాల్లో రాజధాని నిర్మించుకోవచ్చని, ఇదే ప్రధాన రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. హైకోర్టు పనుల కోసం కర్నూలు వెళ్తారని, అసెంబ్లీ సమావేశాల సమయంలో తాము అమరావతి వెళ్తామని వెల్లడించారు.