ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన బస్సు నదిలో పడిన ఘటనలో ఇవాళ ఏడుగురు జవాన్లు చనిపోయారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమరనాథ్ యాత్రకు బందోబస్తు నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 30 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 39 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 37 మంది ఐటీబీపీ, ఇద్దరు జమ్మూ, కశ్మీర్ పోలీసులు ఉన్నారు. చందన్‌వారి జిగ్ మోర్ ఫ్రిస్లాన్ వద్ద బస్సు అదుపు తప్పి పడిపోయింది.
బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన 30 మందికి పహల్గామ్‌లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వీరిని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి)కి మెరుగైన వైద్యం కోసం పంపారు. స్వల్ప గాయాలతో మరో ముగ్గురు పహల్గామ్‌లోని సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వర్షాకాలం కావడం, కొండల మధ్య నుంచి సాగుతున్న వరద నీరు ధాటిగా వస్తుండటంతో బస్సు అదుపు తప్పిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.