పరిపాలన ఎలా ఉంటే ప్రజలు అక్కున చేర్చుకుంటారన్నది నేటి ఫలితాల ద్వారా వెల్లడిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. రెండేళ్లుగా సిఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఏలా ఉంది అని అడిగితే ఇలా ఉందంటూ ప్రజలు తమ ఓటు ద్వారా తీర్పు చెప్పారని వ్యాఖ్యానించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలపై సజ్జల స్పందించారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. “ఈ ఫలితాల ద్వారా మా ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిన నిమ్మగడ్డకు, ఆయన వెనుక ఉన్న చంద్రబాబుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అంటూ సజ్జల స్పందించారు.
పంచాయతీ, పురపాలక, ఇప్పుడు జడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు సజ్జల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వరుస విజయాలే జగన్ పాలనకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ఓ వైపు జగన్ ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంటే మరోవైపు ఓటమి ఖాయమని తెలిసే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుని డ్రామాలు ఆడిందన్నారు.
98 శాతం జెడ్పీటీసీలు వైయస్‌ఆర్‌సీపీ గుర్తుపై విజయం సాధించామని, అబద్ధాలు, కల్పితాలపై కాకుండా విశ్వసనీయత ఉంటే ప్రజలు ఎలా అక్కున చేర్చుకుంటారో ఈ ఎన్నికల ద్వారా రుజువైందని సజ్జల అన్నారు. గుణపాఠం నేర్చుకునే స్థితిలో టీడీపీ లేదని, మిగతా పార్టీలైనా నేర్చుకోవాలని సలహా ఇచ్చారు.
టీడీపీ భవిష్యత్ ఏమిటో కుప్పం ఫలితం ఒక్కటి చాలని ఎద్దేవా చేశారు. దీవాళ తీసి అడ్డంగా ఐపీ పెట్టిందా అన్నట్లుగా ఉన్న టీడీపీ పరిస్థితి ఉందన్నారు సజ్జల. కుప్పంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు తమకే వచ్చాయని, మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి 62,952 ఓట్లు మెజారిటీ వచ్చిందని వివరించారు. టీడీపీ కథ సమాప్తం అయ్యిందని చెప్పడానికి ఈ ఫలితం ఒక్కటి చాలని వ్యాఖ్యానించారు. నేటి విజయంతో ప్రజలు తమపై మరింత బాధ్యత పెంచారని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూసి ప్రజలకు మరింత దగ్గరవుతామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.