తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనను తమ పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని భారతీయ జనతా పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర నాయకత్వమేనని, ఈ విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి నిర్ణయాలూ ఉండబోవని స్పష్టం చేశారు. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో పవన్ కూడా ఈ విషయమై తమ పార్టీ పెద్దలతో చర్చించారని జీవీల్ చెప్పారు. పవన్ తాజా వ్యాఖ్యలు కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా వెళ్లి ఉంటాయని, ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో జరిగే పరిస్థితి తెలుసుకున్తారన్నారు. విశాఖ బిజెపి కార్యాలయంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి బిజెపి, జన సేన కలిసి ఉన్నాయని వ్యాఖ్యానించారు.
కర్నాటక ఫలితాలపై విశేషణ చేసుకుంటామని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపబోవని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. గతంలో కూడా మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిస్తే ఆ వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకుందని గుర్తు చేశారు. తెలంగాణాలో కూడా కేవలం ఒక్క అసెంబ్లీ కే పరిమితమైన తమ పార్టీ ఆ తర్వాత నాలుగు లోక్ సభ సీట్లు గెల్చుకుందన్నారు.