Tuesday, February 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశేషేంద్ర జ్ఞాపకాలు

శేషేంద్ర జ్ఞాపకాలు

“చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక
వసంతమన్నా దక్కేది…
మనిషినై పుట్టి అదీ కోల్పోయాను!”

“శబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు
ఒక మధుపాత్రలా?
అతడు కవి అయి ఉంటాడు!
ఒక గీతికతో ఈ వసంతఋతువుకు
ప్రారంభోత్సవం చేసింది ఎవరు?
అది కోకిల అయి ఉంటుంది!”

“నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి
కవులు కంటున్న కలలు మనుష్యుల్లో ఫలిస్తాయి”

“పొద్దున్నే స్నానమాడి ఒక తామరపువ్వు
సరస్సునంతా స్మృతులతో
పరిమళభరితం చేసింది
దానికి మూర్ఛపోయి చంద్రుడు
అందులో పడి కరిగిపోయాడు!”

“వసంతం అంటే
కోకిలల పాఠశాల;
పక్షుల సంగీత అకాడమీ;
ఒక్కో పక్షి వెయ్యేసి పాటలుగా రూపాంతరం పొందే రుతువు”

“నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది”  లాంటి గుంటూరు శేషేంద్ర(1927-2007) మాటలు వినీ వినీ ఆయనంటే ఆరాధన ఏర్పడింది నాకు.

“శేషేన్! శేషేన్!
నీ పొయెమ్స్ చూసేన్!
అవి బహు పసందు చేసేన్!
అది పద్యమా?
ఫ్రెంచి మాద్యమా?”
అని శ్రీశ్రీ అంతటివాడే పొంగిపొయాక నేనెంత?

ఒక దినపత్రికలో నేను ఆదివారం అనుబంధం మ్యాగజైన్ ఇన్ ఛార్జ్ గా చేస్తున్న రోజులవి. కవి, విమర్శకుడు, ప్రస్తుతం అమెరికాలో బోధనా వృత్తిలో స్థిరపడ్డ అఫ్సర్ నాకు సీనియర్. శేషేంద్ర గురించి పలవరించే నాకు అఫ్సర్ ఒక బహుమతి ఇచ్చారు. నేను రేపు నాంపల్లి ధన్ రాజ్ గిరి బంగ్లాలో శేషేంద్రను కలవడానికి వెళుతున్నాను. వస్తావా? అని అడిగారు. అలాగే అన్నాను. వెళ్లాము. ఎందరో కవులను, పండితులను కలిశాను, కలుస్తూనే ఉన్నాను కానీ…శేషేంద్రను కలిసిన జ్ఞాపకం ముందు మిగతావన్నీ దిగదుడుపే.

బంగ్లా గేటు దాటి లోపలికి వెళితే పెద్ద రాజభవనం. అంతెత్తు స్తంభాలు. అతిథులు కూర్చోవడానికి ప్రత్యేకమైన చోటు. అందమైన సోఫాలు. కృష్ణదేవరాయల అభ్యంతర మందిరంలో కూర్చున్నట్లు ఉంది నాకు. మేము వచ్చామని సేవకులు చెబితే…మొదట శేషేంద్ర వచ్చారు. తెల్లటి పట్టు పంచె. జుబ్బా. కవిసార్వభౌముడు నడిచివచ్చినట్లు వచ్చి మాకు ఎదురుగా కూర్చున్నారు. అఫ్సర్ నన్ను పరిచయం చేశారు. ఇప్పుడయితే నోరుమూసుకుని ఉండేవాడిని. అప్పుడు నా వయసు 25. ఆయన డెబ్బయ్ ల దగ్గరున్నారు. గుంటూరు శేషేంద్ర అన్న కవి రాసిన కవిత్వం గురించి గుంటూరు శేషేంద్రకే చాలాసేపు క్లాసు తీసుకున్నా. అఫ్సర్ సిగ్గుతో తలదించుకున్నారు. శేషేంద్ర హాయిగా నవ్వుకున్నారు. బెల్ కొట్టి వీరికి ఏవయినా తీసుకురండి అన్నారు. ఈలోపు వారి సతీమణి కూడా వచ్చి పక్కన కూర్చున్నారు.

ఒక మహారాజు మరో మహారాజుకు అతిథి మర్యాదలు చేస్తున్నట్లు…పెద్ద వెండి పళ్లెంలో చిన్న చిన్న వెండి గిన్నెలు. అందులో జీడిపప్పు. పిస్తా. ఎండు ద్రాక్ష. చ్యవనప్రాశ్య్ . డ్రై ఫ్రూట్స్ వరకు ఓకే. ఈ చ్యవనప్రాశ్య్ ఏమిటి సార్? అని అడిగాను. ఆరోగ్యానికి మంచిది తిను అన్నారు. తరువాత వెండి గ్లాసుల్లో మంచి నీళ్లు. కాఫీ. గంటలు సెకెన్లలా దొర్లిపోయాయి.

ఆయన నా అనంతమైన అజ్ఞానాన్ని హాయిగా భరిస్తున్నారన్న నమ్మకంతో …  సార్! మీ కవిసేన మ్యానిఫెస్టోలో ఇలా ఎందుకన్నారు? అలా ఎందుకనలేదు? కట్టమంచి రామలింగా రెడ్డి కవితత్వ విచారంలో ఇలా అన్నారు కదా? లాంటి అనేకానేక చొప్పదంటు ప్రశ్నలను శరపరంపరగా సాధించాను.

“నగరం రోడ్డుమీద సిటీ బస్సుకు గుద్దుకుని సూర్యుడు చచ్చాడు”
లాంటి ఆయన కవిత్వంలో చావని సూర్యుడి గురించి ఆయనకే చెప్పాను.

“నువ్ కవిత్వం రాస్తావా?”
అని అడిగారు. హమ్మయ్య ఇప్పుడు దారిలోకి వచ్చింది చర్చ అనుకుని..
బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు విచ్చుకుంటూ ఉండగా అవునని చెప్పాను. తెలివైనవారు కోరి కొరివితో తల గోక్కోరు కాబట్టి…ఆయన నా కవితలు వింటానని అనలేదు. నాకు నేనుగా సిగ్గు విడిచి చెప్పలేను!

వెంటనే సేవకుడిని పిలిచి…
ఆయన రాసిన ఆధునిక మహాభారతం, మధువర్షంతో పాటు మరికొన్ని పుస్తకాలు సంతకం చేసి…లేచి నాకు బహుమతిగా ఇచ్చి కౌగిలించుకున్నారు. తరువాత విడిగా నేనొక్కడినే సిటీ బస్సెక్కి నాపల్లిలో దిగి ధన్ రాజ్ గిరి బంగ్లా దాకా నడిచి వెళ్లి ఆయన్ను చాలాసార్లు కలిశాను. నేను రాసిన కవిత్వం నువ్ రాసినంత ఆనందంగా, తన్మయంగా చెబుతున్నావ్! అంటూ అలా వింటూ ఉండేవారు. ఒక్కో పద్యానికి ఒక్కో బంగారు నాణెమివ్వాలన్నాడు పిరదౌసి…నువ్ చెప్పే నా పద్యాలు ఒక్కో దానికి ఒక్కో జీడిపప్పు అంటూ కొసరి కొసరి తినిపించేవారు. “కవిత్వం కూడు పెడుతుందా?” అన్న నిట్టూర్పు నిజం కాదనుకుంటా తినేవాడిని. ఆయన మాత్రం ఏమీ తినేవారు కాదు. వినేవారు- అంతే.

ఇప్పటిలా సెల్ఫీలు, విల్ఫీలు లేవు. నా లైబ్రరీలో ఆయన ఇచ్చిన ఆధునిక మహాభారతం, మధువర్షం పుస్తకాలు ముందు వరుసలో ఉన్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ నిదురించే నా తోటలోకి శేషేంద్ర పాటలా వస్తాడు. కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇస్తాడు. రమ్యంగా నా గుమ్మం ముందు రంగవల్లులు అద్దుతాడు. దీనంగా ఉంటే దీపమై వెలుగుతాడు. శూన్యంగా ఉంటే వేణువై పలుకుతాడు. ఆకులు రాలితే…ఆమనిగా వస్తాడు. కొమ్మల్లో పక్షి అవుతాడు. గగనంలో మబ్బు అవుతాడు. నా నావను నది దోచుకుపోతే బావురుమనే రేవు అవుతాడు. నావకు చెప్పమని వెక్కి వెక్కి ఏడుస్తాడు.

మనం అభిమానించే పండితులు, కవులు, రచయితలతో గంటలు గంటలు మాట్లాడే అవకాశం దొరకడం ఒక అదృష్టం. అలా ప్రఖ్యాత కథా రచయిత మధురాంతకం రాజారామ్, సినీ గేయ రచయితలు వేటూరి, సిరివెన్నెలలతో ఏళ్ల తరబడి మాట్లాడిన విషయాలను విడిగా చెప్తాను.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్