My Strength: చంద్రబాబు సైకిల్ తొక్కలేక, తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమం అమలు చేశాం కాబట్టే సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రున తిరిగితే, సైకిల్ చక్రాలు ఊడిపోయాయని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో 151 స్థానాలు గెలిచామని…. 2024లో 175 స్థానాలతో మళ్ళీ తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన ప్రభుత్వ హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తున్నారని, బాబు హయాంలో రాష్ట్రం ఏమైనా అమెరికా అయ్యిందా అని ప్రశ్నించారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ ప్లీనరీలో వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం చేశారు.
ఎల్లో మీడియా రాసినంత మాత్రాన, వారు చూపినంత మాత్రాన అబద్దాలు నిజాలైపోవని ., వారు మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలైపోవని దుయ్యబట్టారు. ఈ గ్రామ సింహాలన్నీ బాబు ప్రజలకు మంచి చేశాడని చెప్పడం లేదని, ఎందుకంటే ఆయన చేసిన మంచి ఏమీ లేదని విమర్శించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని తట్టుకుంటూ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ‘వచ్చే ఎన్నికల సమయానికి మన ప్రభుత్వంపై అసత్యం ప్రచారం ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు… దీన్ని ఎదుర్కోవడానికి నాకున్న గుండె ధైర్యం మీరే’నని సిఎం పేర్కొన్నారు. ‘కౌరవ సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదే’ అంటూ పార్టీ శ్రేణులకు ఉద్భోదించారు. 175 సీట్లు లక్ష్యంగా ముందుకు సాగుదామన్నారు.
జగన్ ప్రసంగలో ముఖ్యాంశాలు:
ఇది అత్మీయుల సునామీ , త్యాగాల సైన్యం ఇక్కడుంది
ఈ మహాసైన్యానికి సెల్యూట్ చేస్తున్నా
పార్టీని గట్టి పునాదుల మీద నిర్మించుకున్నాం
కార్యకర్తల కష్టాల పునాదుల మీదే మన ప్రభుత్వం ఏర్పడింది
నాడు ఓదార్పు యాత్ర మానుకొని ఉంటే నాపై కేసులు ఉండేవి కాదు
2014 ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్ల తేడాతో ప్రతిపక్షంలో కూర్చున్నాం
ప్రతిపక్షంలో ఉన్న ఈ జగన్ ను, పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారు
23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను మన పార్టీ నుంచి పశువులను కొన్నట్లు కొన్నారు
ఆ తర్వాత పాదయాత్రతో, ప్రజలందరి దీవెనలతో 2019లో అధికారంలోకి వచ్చాం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టాం
ఇచ్చిన మాట కోసం ప్రతిరోజూ కష్టపడ్డాం
క్యారెక్టర్, క్రెడిబిలిటీ రెండే ఏ నాయకుడికైనా ముఖ్యం
నాడు గ్రామాలను దోచుకునేందుకు జన్మ భూమి కమిటీలు పెడితే, మన ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి నాంది పలుకుతూ వాలంటీర్లు, విలేజ్, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం
44 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు గానీ, ఆయన పార్టీకి గానీ ఇలాంటి ఆలోచన వచ్చిందా?
బాబు మాదిరిగా చిప్ ఉండాల్సింది వేలి ఉంగరంలోనో, మొకాలులోనో, కాలులోనో కాదు… గుండెల్లో ఉండాలి
కుప్పంను మున్సిపాలిటీ చేయాలని చంద్రబాబు మన పార్టీకి దరఖాస్తు పెట్టుకున్నారు, కుప్పం ప్రజల కోసం మనం చేశాం
తెలుగుదేశం పెత్తందార్ల పార్టీ
చంద్రబాబు హయాంలో టిడిపి పెత్తందార్ల కోసం, పెత్తందార్ల వల్ల, పెత్తందార్లు నడుపుతున్న పార్టీగా మారింది
తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారట, పేద పిల్లలను తెలుగు మీడియంలోనే చదివించాలట
పేదలకు బైజూస్ కంటెంట్ అందిస్తుంటే అదేం జ్యూస్ అంటూ బాబు వెటకారం చేస్తున్నారు
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 95శాతం అమలు చేశాం
మరోవైపు 650 హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోను మాయం చేసిన పార్టీ టిడిపి
రెండు పార్టీల మధ్యా తేడాను గమనించండి
ఈ రెండేళ్ళూ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనులు వివరించండి… దీవించమని అడగండి
పార్టీ బూత్ కమిటీలు ఏర్పాటు చేయండి. వాటిలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు ఉండేట్లు, 50శాతం మహిళలు ఉండేలా చూడండి
టిడిపి చేసే అసత్య ప్రచారాలను, పన్నాగాలను తిప్పుకోట్టాల్సిన అవసరం ఉంది, దీనికోసం గ్రామ స్థాయిలో సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయండి
30 సంవత్సరాల భవిష్యత్తుకు కావాల్సిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా అభ్యుదయ భావాలకు మూలాలు పడ్డాయి
ఇది మరింతగా బలపడాలంటే కార్యకర్తల పాత్ర కీలకం
పార్టీ కార్యకర్తల కష్టాల్లో, సుఖాల్లో పార్టీ తోడుంటుంది
Also Read :