Sunday, January 19, 2025
HomeTrending Newsఇళ్ళ నిర్మాణంపై చిత్తశుద్ది లేదు: కాల్వ

ఇళ్ళ నిర్మాణంపై చిత్తశుద్ది లేదు: కాల్వ

మూడున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ పూర్తి చేసిన ఇళ్ళ సంఖ్య 60వేలు కూడా లేదని మాజీ మంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.  ఈ ప్రభుత్వానికి ఇంకో పది నెలల కాలం మాత్రమే మిగిలి ఉందని, ఈ తక్కువ వ్యవధిలో  ఇంకా ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ఇళ్ళ నిర్మాణం పడకేసిందని, గత ఎన్నికల ముందు వైసీపీ నేతలు ఇంటింటికీ తిరిగి ఇళ్లు లేని ప్రతి పేదవాడికీ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పేరిట 25 లక్షల ఇళ్లు ఐదేళ్ళ కాలంలో నిర్మిస్తామని హామీ ఇచ్చారని కాల్వ అన్నారు.

ప్రభుత్వం మాయ మాటలతో, కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతోందని కాల్వ విమర్శించారు. పేదలకు ఇచిన మాటను నిలబెట్టుకోవడానికి చిత్తశుద్దిగా ప్రయత్నం చేయలేకపోయారన్నారు.  ఇళ్ళ నిర్మాణంపై గతంలో చెప్పిన దానికి, చేస్తున్నదానికి పొంతనలేదన్నారు. 2019-20ఆర్ధిక సంవత్సరంలో  హౌసింగ్ కు 3,617 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం ఖర్చు చేసింది మాత్రం 764 కోట్లు మాత్రమేనని వివరించారు. 20-21లో కేటాయించింది 3,691 కోట్లు అయితే ఖర్చు చేసింది 1,141 కోట్లు మాత్రమేనని, దీన్ని బట్టి పేదల ఇళ్ళ నిర్మాణంపై జగన్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టడంలేదని రుజువైందన్నారు.

జగనన్న కాలనీల నిర్మాణం ఇప్పట్లో పూర్తి కావడం సాధ్యం కాదని, రాబోయే రోజుల్లో అవి నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని కాల్వ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఊరికి దూరంగా ఉన్న ఈ కాలనీల్లో ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించలేకపోయారన్నారు. మళ్ళీ చంద్రబాబు సిఎం అయితేనే ఈ ఇళ్ళ నిర్మాణం పూర్తి కావడం సాధ్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్