Thursday, April 18, 2024
HomeTrending Newsఎప్పటికీ జగనే సిఎం: పెద్దిరెడ్డి

ఎప్పటికీ జగనే సిఎం: పెద్దిరెడ్డి

OTS is for poor:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత కాలం రాష్ట్రానికి ఆయనే సిఎంగా ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, అయన మళ్ళీ ప్రజాబలం సంపాదించుకొని సిఎం అయితే ప్రతిపక్షంలో కూర్చోడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఆ పరిస్థితి ఎంతమాత్రం లేదని పెద్దిరెడ్డి తేల్చి చెప్పారు. శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో పెద్దిరెడ్డి తో పాటు మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, శంకర నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఓటిఎస్ ప్రతి పేదవాడికీ ఎంతో ఉపయోగమైన పథకమని, దీనిద్వారా లబ్దిదారులకు తమ ఇంటిపై యాజమాన్య హక్కులు వస్తాయని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన రుణం, దానిపై వడ్డీ వసూలు చేయకుండా కేవలం నామమాత్రపు ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ఈ మంచి కార్యక్రమంపై తండ్రీ కొడుకులు రాద్ధాంతం చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.

2014 ఎన్నికల్లో షుమారు వంద పేజీల మేనిఫెస్టోలో 500 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత  వాటిని అమలు చేయలేకపోయారని, కానీ జగన్ కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మాత్రమే విడుదల చేసి రెండేళ్ళలోనే దాదాపు 95 శాతం హామీలు అమలు చేశారని వివరించారు.  రెండేళ్లుగా కరోనాతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైనా ప్రజలకిచ్చిన హామీలను మాత్రం జగన్ నేరవేరుస్తున్నారని, హామీ ఇవ్వకపోయినా విద్య, వైద్య రంగంలో నాడు-నేడు పేరుతో  పాఠశాలలు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నారని, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారని పెద్దిరెడ్డి వివరించారు.

ఓటిఎస్ ద్వారా 50 లక్షల మందికి లబ్ధి కలిగే ఆస్కారం ఉందని, కానీ టిడిపి, దానికి బాకా ఊదే మీడియా దీనిపై విష ప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. గతంలో ప్రభుత్వాలు ఈ పథకం ద్వారా అసలు కడితే వడ్డీ మాఫీ చేసేవని… కానీ 2014-19 కాలంలో చంద్రబాబు ప్రభుత్వం వడ్డీ మాఫీ చేసేందుకు కూడా అంగీకరించలేదని గుర్తు చేశారు. పేదల నోటికాడికొచ్చిన ఈ మంచి అవకాశాన్ని వ్యతిరేకిస్తూ పైగా తాను అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు.

Also Read : పథకాలకు సహకరించండి: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్