Friday, September 20, 2024
HomeTrending NewsYS Jagan: గెలుపే ప్రామాణికం - బిసిలు, మహిళలకు పెద్దపీట

YS Jagan: గెలుపే ప్రామాణికం – బిసిలు, మహిళలకు పెద్దపీట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాబోయే సాధారణ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టారు. తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసి పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కూటమిలో బిజెపి ఉంటుందా ఉండదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బిజెపి ఒంటరిగా పోటీ చేసినా, టిడిపి-జనసేనతో కలిసి పోటీచేసినా గెలుపే ధ్యేయంగా జగన్ తన వ్యూహాలకు తెరతీశారు. తొలివిడతగా గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి 11 నియోజకవర్గాల్లో కొంతమందికి టిక్కెట్లు నిరాకరణ, మరికొంతమందికి సీట్ల మార్పుతో భారీ ప్రక్షాళన ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాలకు చెందిన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.  వీలైతే ఈ నెలాఖరు నాటికి కసరత్తు పూర్తి చేసి నూతన సంవత్సరం తొలివారంలోనే అభ్యర్దుల పూర్తి జాబితాను విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. బుజ్జగింపుల పర్వం పూర్తి కాకపొతే సంక్రాంతి నాటికి ప్రకటన ఉంటుంది.

ఇటీవలే ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ ఓటమి తర్వాత…  ప్రజల్లో కేసిఆర్ పై సానుకూల దృక్పథం ఉన్నా అభ్యర్ధులపై ఉన్న వ్యతిరేకత వల్లే అధికారం కోల్పోవాల్సివచ్చిందని విశ్లేషణలు స్పష్టం చేశాయి. అలాంటి తప్పిదం ఏపీలో జరగకూడదనే… నాలుగైదు రకాల సర్వేలు నిర్వహించి… వాటిని సమగ్రంగా పరిశీలించి అంతిమంగా ఓ నిర్ణయానికి జగన్ వస్తున్నారు. మరోవైపు నాలుగేళ్ళుగా సామాజిక సాధికారతదిశగా విప్లవాత్మక చర్యలు తీసుకున్న జగన్ చట్టసభల్లో కూడా బిసిలకు మెరుగైన అవకాశాలు కల్పించాలని యోచిస్తున్నారు. దీనితో పాటుగా సామాజిక సమీకరణల దృష్ట్యా కొంతమందిని మార్చలేని పరిస్థితుల్లో కనీసం ఆయా స్థానాల్లో వారి కుటుంబంలోని మహిళలకు టిక్కెట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

కేంద్రం గత పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు 2029ఎన్నికల నాటికి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే జగన్ ఈ ఎన్నికల్లోనే వీలైనంత ఎక్కువమంది మహిళలకు టిక్కెట్లు కేటాయించే అంశాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నారు. పిఠాపురంలో దొరబాబు స్థానంలో వంగా గీత, విజయవాడ వెస్ట్ లో వెల్లంపలికి బదులు మేయర్ భాగ్యలక్ష్మిపేర్లు దాదాపు ఖరారు చేశారు.

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అండగా ఉన్న బిసిలు గత ఎన్నికలో కొంత మేర  వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. బిసి ఓటు బ్యాంకును సుస్థిరం చేసే దిశలో ఆయా వర్గాలకు, ఇప్పటివరకూ చట్ట సభల్లో అవకాశం దక్కని బిసి కులాల వారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఆయా సామాజికవర్గాల వారు ఏయే స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారో బేరీజు వేసుకొని రాష్ట్రం యూనిట్ గా అభ్యర్ధిని ఖరారు చేసేపనిలో ఉన్నారు. ఉదాహరణకు ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఏలూరు ఎంపి స్థానంలో పోటీ చేయిస్తున్నట్లు వినబడుతోంది. యాదవ సామాజిక వర్గం గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉన్న ఏలూరుకు అనిల్ ను రప్పిస్తున్నట్లు సమాచారం. సామాజిక సాధికార బస్సు యాత్రల ద్వారా నేతలను రాష్ట్రవ్యాప్తంగా తిప్పుతూ ప్రజలతో వారిని మమేకం చేసే పని మొదలుపెట్టారు.

ఇలా కేవలం గెలుపే ప్రాతిపదికగా, బిసిలు-మహిళలకు వీలైనన్ని ఎక్కువ సీట్లు కేటాయించి తద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. టిక్కెట్లు దక్కని వారిని, స్థానచలనంతో వేరే ప్రాంతాలకు వెళుతున్న వారిని సిఎం జగన్ స్వయంగా పిలిపించుకొని హితబోధ చేస్తున్నారు. జగన్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఏమేరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్