సంవత్సరంలోగా అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్న సిఎం జగన్ ఆ హామీని ఇంతవరకూ నిలబెట్టుకోలేక పోయారని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ ఘటనపై హై లెవెల్ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని చెప్పిన సిఎం.. ఆ కమిటీ ఏమైందో కూడా చెప్పాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పవన్ స్పందించారు.
“19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చేయరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు.
ప్రమాద ఘటన జరిగిన వెంటనే AP CM అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నాము ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో , AP CM ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక.
అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మానం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు దుర్ఘటన జరిగి ఈరోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటి కి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారు.
కేంద్ర జలవనురుల శాఖ మంత్రి శకావత్ గారు రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారు.” అని పవన్ పేర్కొన్నారు.