అండగా నిలుస్తున్న అందరికీ సెల్యూట్: జగన్

Salute:  తన తండ్రి, వైఎస్ ఆశయాలు, మన ఆత్మాభిమానం కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ మరణానంతరం సెప్టెంబర్ 25, 2009న పావురాల గుట్టలో మొదలైన మన సంఘర్షణ ఓదార్పు యాత్రతో ఓ రూపం తీసుకుందని…. నాటి నుంచి లక్షలాది మంది తోడుగా ఉన్నారని, అందరికీ జగన్ ‘సెల్యూట్’ చేశారు. ఎన్ని వ్యవస్థలు మనపై కత్తులు దూసినా, నిందలు వేసినా, కుట్రలు చూసినా  ప్రజలు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. వారి కట్టు కథలకు విలువలేదని, తన గుండె బెదరలేదని, సంకల్పం చెక్కు చెదరలేదని వ్యాఖ్యానించారు. నాటినుంచి తన పోరాటంలో వెంట నిలిచిన కార్యకర్తలు, ప్రజల అండతో 2019లో అధికారంలో రాగాలిగామని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, ఇప్పటికే 95శాతం హామీలు అమలు చేశామన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తరువాత కనబడకుండా చేసిన తెలుగుదేశం పార్టీ ఓవైపు ఉంటే, మేనిఫెస్టోను పవిత్రంగా భావించి వాటి అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.

అవినీతి లేకుండా, మధ్యవర్తులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి, సామాజిక న్యాయం, ఆర్ధిక న్యాయం అంటే ఏమిటో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపామన్నారు. ఒక మాట కోసం, వ్యవస్థల్లో విలువలు కొనసాగించడం కోసం మన ప్రయాణం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజలందరి సంక్షేమం కోసం తాము పని చేస్తున్నామని తెలిపారు.

14ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఏదైనా ఒక పథకం పేరు చెప్పగానే అయన పేరు గుర్తుకు వస్తుందా అని చంద్రబాబును ఉద్దేశించి జగన్ ప్రశ్నించారు. తాము ఇంతగా ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుంటే… ఓర్వలేక, ప్రతిపక్షం… ఎల్లో మీడియా, వీరికి తోడు దత్తపుత్రుడు అంతా ఏకమై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  తాము మంచి చేశాము కాబట్టే ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి మేనిఫెస్టో అమలు గురించి చెప్పగాలుగుతున్నామని ధీమా వ్యక్తం చేశారు.  రెండ్రోజుల ప్లీనరీలో మరిన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రజలకు మరింతగా ఎలా మేలు చేయవచ్చో ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ ఇదే అభిమానంతో ఆశీర్వదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *