Sunday, January 19, 2025
HomeTrending Newsఎన్.డి.ఏ. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్ కర్

ఎన్.డి.ఏ. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్ కర్

ఎన్.డి.ఏ. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ ను బిజెపి ఎంపిక చేసింది. రాజస్ధాన్ లోని ఝన్ ఝన్ కు చెందిన జగదీప్ ధన్ కర్ 1989 నుంచి 1991 వరకూ లోక్ సభ సభ్యుడు గా ఉన్నారు. ఈ రోజు (శనివారం) సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జగదీప్ ధన్ కర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజస్థాన్‌లోని కిథానా అనే కుగ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన జగదీప్.. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1989లో ఝుంఝును నుంచి జనతాదళ్ తరఫున లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ పని చేసిన జగదీప్.. సుప్రీం కోర్టు న్యాయవాదిగా, రాజస్థాన్ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2019 జూలై 30న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన్ను బెంగాల్ గవర్నర్‌గా నియమించారు.

వాస్తవానికి ఎన్డీయే ఉపరాష్ట్రపతి రేసులో కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవడం.. ఆయన్ను రాజ్యసభకు రెన్యువల్ చేయక పోవడంతో.. నఖ్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తారని భావించారంతా. కానీ అనూహ్యంగా రాజస్థాన్‌కు చెందిన జగదీప్‌ పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయానికి వస్తే.. ఆగస్టు 6న ఎన్నికలు జరుగుతాయి. జూలై 19తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగియనుంది. జగదీప్ ఎంపిక ద్వారా అటు రాజస్థాన్‌తోపాటు.. బెంగాల్‌లోనూ ప్రయోజనం కలుగుతుందనే భావనతోనే బీజేపీ ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గవర్నర్ గా జగదీప్ ధన్ కర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read : ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్