For farmers: తాము ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగాలేమని, ప్రజలను పల్లకి ఎక్కించడానికే తాము ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఏదో పార్టీకి పల్లకీ మోస్తున్నామంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పవన్ తిప్పికొడుతూ… ‘మీరు మా జనసైకులపై అంత ప్రేమ కనబర్చాల్సిన అవసరం లేదం’టూ వ్యంగ్యాస్త్రం సంధించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాబోవడం లేదు, తప్పకుండా రాదు’ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాని పార్టీ కోసం తపన పడొద్దంటూ వైసీపీ నేతలకు సూచించారు. చాలా ఆలోచించిన తర్వాతే వైసీపీ ఓటు చీలనీయబోనని చెప్పానని పవన్ అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికీ లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించామన్నారు పవన్. అన్నం పెట్టే రైతుకు కులం, మతం, ప్రాంతం ఉండదని, కానీ వైసీపీ ప్రభుత్వం వారిలో కూడా కులాన్ని చూస్తోందని మండిపడ్డారు. లక్ష రూపాయలు ఇస్తే వారి సమస్య తీరకపోవచ్చని, కానీ అన్నం పెట్టె రైతన్నకు అండగా ఉండాలని అభిప్రాయపడ్డారు. దీనికోసం జనసేన పార్టీకి తన వంతు విరాళంగా ఐదుకోట్ల రూపాయల చెక్ ను అయన పార్టీ నేత ఏవీ రత్నం కు అందించారు. పవన్ సోదరుడు నాగబాబు కూడా తన వంతు సాయంగా పది లక్షల రూపాయలు అందించారు. జనసేన రైతు భరోసా యాత్ర పేరుతో రాష్ట్రంలోని కౌలురైతుల కుటుంబాలను పరామర్శిస్తామని, మొదటగా ఈనెల 12న అనంతపురంలోని 30 మంది రైతులకు ఆర్ధిక సాయం అందిస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
జనసేన సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసారు:
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణ ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలి
- అమరావతి లోనే రాజధాని ఉండాలి
- ఇంధన ధరల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వాటా తగ్గించాలి
Also Read : ప్రజలకు దత్త పుత్రుడిని: పవన్ కళ్యాణ్