వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటనపై జనసేన హర్షం వ్యక్తం చేసింది. తమ నేత పవన్ కళ్యాన్ ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు ఫలించాయని సంతోషం వ్యక్తం చేసింది. కాగా, వైజాగ్ స్టీల్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు కేసిఆర్ ప్రయత్నించినందువల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సిబిఐ మాజే జేడీ వివి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
జనసేన పార్టీ అధికారిక ఖాతాలో “విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవ్వకుండా, కార్మికుల పక్షాన తొలి నుండి పోరాడుతూ, కేంద్రంతో సంప్రదింపులు జరిపిన ఏకైక పార్టీ జనసేన. గత వారం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా కేంద్రానికి వివరించారు. ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి సహకరిస్తామని చెప్పడం ఆనందంగా ఉంది. కనీసం పార్లమెంట్ లో నోరు మేదపలేని స్థితిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ తీసుకున్న చొరవ ఫలితంగా భావిస్తున్నాం” అంటూ పేర్కొంది.
కాగా, వివి లక్ష్మీనారాయణ “శ్రీ కేసీఆర్గారికి ధన్యవాదాలు, ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈఓఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని, RINLని బలోపేతం చేయలని ఆలోచించడానికి కారణం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలి” అంటూ ట్వీట్ చేశారు.