Sunday, September 8, 2024
HomeTrending NewsTerrorist : గోదావరిఖనిలో ఉగ్రవాదుల కలకలం

Terrorist : గోదావరిఖనిలో ఉగ్రవాదుల కలకలం

ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మంగళవారం రాత్రి మహమ్మద్ జావిద్ (46) తో పాటు అతని కూతురు ఖతిజా (19) ను అదుపులోకి తీసుకున్నారు. రామగుండము పోలీస్ కమిషనర్ ముందు హాజరుపరిచిన గుజరాత్ ఏటీఎస్ అధికారులు, విచారణ కోసం తమ అదుపులోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

జావిద్ హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. తండ్రి కూతుర్లు టోలి చౌక్ లో నివాసం ఉంటున్నారు. బక్రీద్ పర్వదినం కోసం తండ్రి కూతుర్లు గోదావరిఖనికి వచ్చినట్టు సమాచారం.

అయితే తండ్రి కూతుర్లు ఏ టెర్రరిస్ట్ సంస్థతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు, వీరి ప్రమేయం ఎంత మేర అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సాంకేతికంగా టెర్రరిస్ట్ సంస్థలకు సహకరిస్తున్నారా లేక ఇతరాత్ర సహాకారం అందిస్తున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది. అనుమానితులగా మాత్రమే తీసుకెల్తున్నామని ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసు అధికారులకు వివరించినప్పటికీ వీరి ఆచూకి దొరకబట్టుకుని మరీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం వరకు వచ్చి అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన వారి గురించి గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్