చంద్రబాబు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ ఆరోపించారు. ఈ హామీ తోనే 2014 ఎన్నికల్లో అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కైకలూరు అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారని, ఆ సమయంలో తనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో జయమంగళ వెంకట రమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డి సామాజిక వర్గానికి సిఎం జగన్ న్యాయం చేస్తారని, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని చెప్పారు.
2009లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకట రమణ, ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. నిన్ననే టీడీపీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇంచార్జ్ పదవికి ఆయన రాజీనామా చేశారు.
జయమంగళ వెంకట రమణతో పాటు టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజుకూడా వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావులు పాల్గొన్నారు.