ఆచార్య జయశంకర్ సార్ 11 వ వర్ధంతి పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదని నేతలు కొనియాడారు. తెలంగాణ సాధనే స్పూర్తిగా, ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితకాలం పోరాడిన ధీశాలి అని కీర్తించారు.
తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు అని ఆయన పేర్కొన్నారు. దివంగత ఆచార్య జయశంకర్ సార్ 11 వ వర్ధంతిని పురస్కరించుకుని సూర్యపేట జిల్లా కేంద్రంలోని మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఆంద్రప్రదేశ్ లో కలిపిన రోజునే బలంగా వ్యతిరేకించిన యోధుడు జయశంకర్ సార్ అని ఆయన తెలిపారు. అటువంటి మహానుబావుడి సంకల్పసిద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారన్నారు.
అటు రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, వేముల ప్రశాంత్ రెడ్డి ఆచార్య జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి,ఎమ్మెల్సి రాజేశ్వర్ రావు, నిజమాబాద్ డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జక్క రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైం గా,కొందరు ఫుల్ టైంగా ఉన్నారు కానీ జయశంకర్ సర్ లైఫ్ టైం ఉద్యమకారుడని మంత్రి వేముల కొనియాడారు. జయశంకర్ సార్ తన జీవితకాలం రాష్ట్ర సాధనకోసమే పని చేసిన వ్యక్తి. తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అన్నారు.
ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా హన్మకొండ ఏకశిల పార్క్ లో గల ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్ సార్ అని గుర్తు చేశారు. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించిన మహనీయుడన్నారు.