అంజలి ప్రధానమైన పాత్రను పోషిచిన ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1 లో భాగంగా ఈ వెబ్ సిరీస్ నుంచి ముందుగా 6 ఎపిసోడ్లను రిలీజ్ చేశారు. ఈ కథ కేరళ .. గోవా .. సౌత్ ఈస్ట్ .. హైదరాబాద్ నేపథ్యంలో నడుస్తుంది. కేరళలో మొదలైన ఈ కథ అక్కడి నుంచి అనేక మలుపులు తీసుకుంటుంది. తన గతాన్ని మరిచిపోయిన ఒక యువతి, సంకీత్ కి తారసపడుతుంది. మొదటి భార్యతో విడిపోయిన ఆయన, తన కూతురు మేహా కోసం ఆ యువతిని చేరదీస్తాడు. వాళ్లే ఆమెకి ‘ఝాన్సీ’ అనే పేరు పెడతారు. ఝాన్సీ ఒక బొటిక్ నడుపుతూ ఉంటుంది.
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు ఆమె కళ్లముందు కదలాడుతూ ఆమె మనసులో అలజడి రేపుతుంటాయి. అవి తన గతం తాలూకు సంఘటనలని ఆమె తెలుసుకుంటుంది. వర్తమానంలో తన జీవితం సాఫీగా కొనసాగాలంటే గతం తాలూకు విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె తన అన్వేషణను మొదలు పెడుతుంది. ఈ విషయంలో ఆమె ధృవ సాయం తీసుకుంటుంది. ఝాన్సీ గతం ఎలాంటిది? గతాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ పరిణామలను ఆమె ఎలా ఎదుర్కొంది? అనేది కథ. మొదటి ఎపిసోడ్ నుంచి 6వ ఎపిసోడ్ వరకూ ఈ కథ ఆసక్తికరంగా .. ఆకట్టుకునే విధంగా కొనసాగుతుంది.
గణేశ్ కార్తీక్ అందించిన కథ ఇది. ఆసక్తిని రేకెత్తించే అంశాలను కలుపుకుంటూ .. ఉత్కంఠను కలిగించే స్క్రీన్ ప్లే తో ఈ కథ నడుస్తుంది. దర్శకుడు ‘తిరు’ పాత్రలను మలిచిన విధానం .. సహజత్వానికి దగ్గరగా ఆయా సన్నివేశాలను ఆవిష్కరించిన విధానం మనసును పట్టుకుంటాయి. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఆర్వీ ఫొటో గ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచాయి. అంజలి చుట్టూనే అన్ని పాత్రలు తిరుగుతూ ఉంటాయి. యాక్షన్ .. ఎమోషనల్ సీన్స్ లోను ఆమె గొప్పగా చేసింది. ఈ 6 ఎపిసోడ్స్ ను చూసినవారు, ఆ తరువాత ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయకుండా మాత్రం ఉండలేరు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ గా దీనిని గురించి చెప్పుకోవచ్చు.