సెంటు స్థలంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపట్ల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు ఇచ్చిన గంజాయి తాగి మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని, వీటిలో 20 లక్షల ఇళ్ళు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. బాబు తన 14 ఏళ్ళ పాలనలో కనీసం లక్షమందికైనా సెంటు భూమి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి మీడియాతో మాట్లాడారు.
సెంటు స్థలం సమాధి పూడ్చటానికి కూడా సరిపోదంటూ బాబు చేసిన వ్యాఖ్యలతో 30 లక్ష మంది అక్క చెల్లెమ్మలు ఆ పార్టీని సమాధి చేయబోతున్నారని హెచ్చరించారు. పేదవారంటే అంత చులకనా? కేవలం ఓట్లు వేయడానికే తమ వర్గాలవారు ఉన్నారా అంటూ నిలదీశారు. పేదలు, ఎస్సీలు, బీసీలపై ఆయనకున్న వివక్ష మరోసారి ప్రదర్శించారని జోగి వ్యాఖ్యానించారు.
పేద వర్గాలకు ఇక్కడ నివసించే అర్హత లేదంటూ నిస్సిగ్గుగా బాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో పేదలు ఉండకూడదంటూ ఏ చట్టంలో ఉందని సూటిగా ప్రశ్నించారు. పేదలకు ఇళ్ళు ఇవ్వాలనుకుంటే దీనిపై కోర్టుకు వెళ్లడాన్ని మంత్రి తపుబట్టారు. సుప్రీం కోర్టు కూడా దీన్ని తప్పుబట్టి తమ నిర్ణయాన్ని సమర్దిన్చిందని గుర్తి చేశారు. బాబు పెత్తందార్ల పక్షాన నిలబడ్డారని, రాబోయే ఎన్నికల్లో టిడిపిని పాతర వేయడానికి ఈ వర్గాలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేదని బాబు చెబుతుంటే, తాను పార్టీ పెట్టిందే బాబు కోసమని, సిఎం అభ్యర్ధిని కాదని, బాబు చంక ఎక్కుతానంటూ పవన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కు వ్యతిరేకంగా ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా వారిని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడబోతుందని, కుప్పంలోనూ గెలుస్తామని విశ్వాసం వెలిబుచ్చారు.