Sunday, May 19, 2024
HomeTrending Newsమద్రాస్ విశ్వవిద్యాలయ పుటల్లో మీనాక్షి!

మద్రాస్ విశ్వవిద్యాలయ పుటల్లో మీనాక్షి!

మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు కడంబి మీనాక్షి! తమిళనాడులోని కాంచీపురానికి చెందిన మీనాక్షి 1905 సెప్టెంబర్ 12న కడంబి బాలకృష్ణన్‌, మంగళమ్మ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి మద్రాసు హైకోర్టులో బెంచ్ క్లర్క్‌గా పనిచేశారు. మీనాక్షి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. దీంతో పిల్లల ఆలనా పాలనా అంతా ఆమె తల్లిపైన పడింది. మీనాక్షికి చిన్నప్పటి నుంచి చరిత్రపై ఆసక్తి ఉండేది. మన్నార్గుడి, పుదుకోట్టై, విల్లుపురం, కాంచీపురం వంటి పట్టణాల్లో ఆమె పర్యటించి అక్కడి చారిత్రక విషయాలను తెలుసుకున్నారు.

చరిత్రకారిణిగా, పురాతత్వ శాస్త్రవేత్తగా ఆమె వృత్తి, ప్రవృత్తి నాలుగేళ్ళే సాగడం విచారకరం. ఆమె ముప్పైకిపైగా వ్యాసాలు, నాలుగు పుస్తకాలు రాశారు. వీటిలో ఒక పుస్తకం 1938లో ముద్రణకు నోచుకోగా మిగిలిన మూడూ ఆమె మరణానంతరం అచ్చయ్యాయి. దక్షిణ భారత చరిత్రపై అనేక ఉపన్యాసా లిచ్చారు. “ది అడ్మినిస్ట్రేసన్ అండ్ సోషియల్ లైఫ్ అండర్ ది పల్లవాస్” అనే దానిపై ఆమె చేసిన పరిశోధనను మద్రాసు విశ్వవిద్యాలయం నీలకంఠ శాస్త్రి గారి పర్యవేక్షణలో ముద్రించింది.

1929లో డిగ్రీ ప్యాసైన ఆమె ఎం.ఎ (చరిత్ర) మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదవాలనుకున్నారు. కానీ 1939 వరకూ ఆ కాలేజీలో మహిళలకు ప్రవేశం ఉండేదికాదు. ఎంఎ అంటూ చదివితే ఆ కాలేజీలోనే చేస్తానని ఆమె పట్టుబట్టారు. ఆమె పెద్దన్నయ్య సి. లక్ష్మీనారాయణ అదే కాలేజీలో ప్రొఫెసరుగా పని చేస్తున్న రోజులవి. తన చెల్లెలి విషయంలో తను హామీ అని యాజమాన్యానికి చెప్పి ఒప్పించడంతో ఆమెకు సీటిచ్చారు. అనంతరం 1936లో ఆమె డాక్టరేట్ పొందిన తొలి మహిళగా మద్రాస్ విశ్వవిద్యాలయ చరిత్రపుటల కెక్కారు. మీనాక్షి దగ్గర ఓ స్క్రాప్ పుస్తకం ఉండేది. ఇంగ్లండులో తయారైన ఈ పుస్తకానికి కాలికో కవర్ ఉండేది. ఇందులో పత్రికలలో ప్రచురితమైన తన ఉత్తరాలు, వ్యాసాలు, తనకొచ్చిన ఆహ్వానపత్రాలు వంటివన్నీ మీనాక్షి, ఆమె తల్లి అతికిస్తుండేవారు.

ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ ఉద్యోగం అనుకున్నంత సులభంగా దక్కలేదు. అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది.
ఆలిండియా రేడియో (తిరుచ్చి) స్టేషన్ డైరెక్టర్ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నారు. తనకున్న చదువు సంధ్యలతో పాటు సంగీతజ్ఞానమూ ఆ రేడియో స్టేషన్ ఉన్నతికి దోహదపడుతుందని అనుకున్నారామె. కానీ అక్కడా మొండిచెయ్యి తప్పలేదు. అయినా ఆమె ఉద్యోగాన్వేషణ మానలేదు. తన పుస్తక ప్రతులను అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారితో సహా ఎందరికో పంపారు. 1939లో ఆమె ప్రతి అందుకున్న మైసూరు దివాన్ మీర్జా ఇస్మాయిల్, అది చదివి మీనాక్షి ప్రతిభను ప్రశంసిస్తూ ఓ ఉత్తరం రాశారు. అంతేకాకుండా కొన్ని నెలల తర్వాత ఆమెకు బెంగళూరులోని మహారాణి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఉద్యోగం ఇచ్చారు.
అదే ఏడాది ఆగస్టులో ఆమె తన తల్లితో బెంగళూరుకు చేరుకున్నారు. కానీ ఉద్యోగంలోకి చేరిన కొంత కాలానికే ఆమె అనారోగ్యంపాలై 1940 మార్చి మూడో తేదీన నుంగంబాక్కం (మద్రాసు) లో తన నివాసంలోనే కన్నుమూశారు. చిన్నవయస్సులోనే ఆమె చనిపోవడం దారుణమని, అది తలచుకుంటుంటే హృదయం బరువెక్కుతోందని నీలకంఠ శాస్త్రి 1941లో మీనాక్షి తల్లికి రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు.

మద్రాసు విశ్వవిద్యాలయంలో ఓరియంటల్ స్టడీస్ విభాగాన్ని నెలకొల్పిన సంస్కృత పండితుడు ఎస్. కుప్పుస్వామి ఓమారు మీనాక్షిని గార్గితో పోల్చారు. గార్గి బ్రహ్మజ్ఞాని. వేదాలు, శాస్త్రాలపై పట్టున్న యోగిని. వచక్నుడి కుమార్తె అయిన గార్గి జనక మహారాజు సభలో యాజ్ఞవల్క్యుడిని ఆత్మ, పరమాత్మల గురించీ ప్రశ్నించి తికమక పెట్టిన జ్ఞాని. చిన్నప్పటి నుంచీ గార్గి విద్యాభిలాషను చూసి తండ్రి ఆశ్చర్య పోయారు. బ్రహ్మచారిణి అయిన గార్గి పరబ్రహ్మం ఉనికిని అన్వేషిస్తూ అనేక సూక్తాలు రాశారు. జనకుడి ఆస్థానంలోని నవరత్నాలలో ఈమె ఒకరు. ఉపనిషత్తులలో, ప్రధానంగా బృహదారణ్యకోపనిషత్తులో గార్గి – యాజ్ఞవల్క్యుడి మధ్య జరిగిన సంభాషణలున్నాయి. ఉపనిషత్తులలో ఆమెను ఓ గొప్ప వేదాంతజ్ఞానిగా అభివర్ణించారు. గార్గిలా మీనాక్షి ఎవరికీ సవాల్ విసరకపోవచ్చు కానీ నాటి సమాజంలోని కట్టుబాట్లను అధిగమించి తను అనుకున్న రంగాన్ని ఎంచుకుని ముందుకుపోవడం విశేషమన్నారు కుప్పుస్వామి!!

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్