Saturday, January 18, 2025
HomeTrending Newsప్రధాని మోదీ, కేంద్రమంత్రులకు కేటీఆర్‌ సూటి ప్రశ్న

ప్రధాని మోదీ, కేంద్రమంత్రులకు కేటీఆర్‌ సూటి ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగర పరిధిలోని కైతలాపూర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి, అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘రాబోయే వారం రోజుల్లో దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు వస్తున్నరట.. వారందరినీ కూకట్‌పల్లి వేదికగా అడుగుతున్న.. ప్రధానమంత్రి గుజరాత్‌ రూ.20వేలకోట్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటరు. ఇంకోకాడికి ఆడో వేలకోట్లతో కార్యక్రమని ప్రకటన చేస్తరు.. మరి అది నిజమో, అబద్ధమో తెల్వదు. మీరు ఇప్పటి వరకు చెప్పిన చాలా మాటలు జుమ్లాలు, ఉత్త డొల్ల మాటలు తప్ప మాటలు తప్ప అందులో విషయం ఉండదు’ అంటూ విమర్శించారు. రూ.15లక్షలు వచ్చాయా?
2014లో జన్‌ధన్‌ ఖాతాలు తెరువాలని రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పాడని.. ఒక్కరికైనా రూ.15లక్షల వచ్చాయా? బహిరంగ సభ వేదికగా ప్రశ్నించారు. ‘బిహార్‌లో ఒక అమాయకుడు దాస్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ఉంది. బ్యాంకు అధికారులు తప్పు చేశారు.. ఆ బ్యాంకుకు సంబంధించిన దాస్‌ అకౌంట్లో పడ్డయ్‌.. ఆయన మోదీ గారు రూ.15లక్షలు ఇస్తా అన్నారు కదా?.. అందులో మొదటి కిస్తీ వచ్చింది.. ఇగ నేను ఇళ్లు కట్టుకుంటా అని మొదలు పెట్టిండు. పైసలు ఖర్చు పెట్టిండు.. నేను చెప్పేది అబద్ధం కాదు.. కావాలంటే గూగుల్‌ వెతకండి.. మీకే తెలుస్తుంది. నేను చెప్పేది కథ కాదు.. నిజమే.. గూగుల్‌లో కొట్టండి.. గూగుల్‌ తల్లే చెబుతుంది.

రూ.15లక్షల్లో రూ.6లక్షలు వచ్చాయని ఇళ్లు కట్టుడు మొదలు పెట్టిండు.. ఈ లోపు బ్యాంకు అధికారులకు తప్పు అర్థమైంది. పోయి దాస్‌ గారిని అడిగారు.. అయ్యా అవి మా పైసలు.. వాపస్‌ ఇవ్వమన్నరు.. ఆయన ‘చల్‌ మీ పైసలు ఎందుకైతయ్‌. నాకు చెప్పిండు రూ.15లక్షలు ఇస్తా అని.. ఆరే ఇచ్చిండు.. ఇంకా తొమ్మిది లక్షలు ఇచ్చేదున్నది.. ఆయననే ఇవ్వమని ఆయన లొల్లి పెడుతున్నడు. పాపం అమాయకపు దాస్‌ వీళ్లు చెప్పే డొల్లమాటలు.. జూటామాటలు నమ్మి ఇంకా రూ.9లక్షలు ఎప్పుడు వస్తయని ఆ బ్యాంకుతో యుద్ధం చేస్తున్నడు. ఒకటి కాదు చెప్పింది.. ఇలా చానా చెప్పారు. 2022 సంవత్సరంకల్లా ఈ దేశంలో ఎక్కడ పేదవాడికి కూడా తప్పకుండా ఇండ్లు చెస్తా అని మోదీ చెప్పిండు. అందరికీ భారతదేశంలో ఇండ్లు వచ్చాయా?.. ఎవరికీ రాలే.. ఎందరికి వచ్చినయంటే అది చెప్పరు’ అంటూ విమర్శించారు.

హైదరాబాద్‌లో వరదలొస్తే పైసా ఇవ్వలే
2022 కల్లా భారతదేశంలోని ఇంటింటికీ నల్లాపెట్టి నీరు అందిస్తానని మోదీ అన్నారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని.. ఇంటింటికీ నల్లానీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, దానికి ఒకపైసా కూడా సాయం చేయలేదని ఆరోపించారు. నీతి ఆయోగ్‌ స్వయంగా రూ.19వేలకోట్ల సాయం చేయమని చెప్పినా 19 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. అది మాత్రమే కాకుండా ఎన్ని అడిగినా ఈ ఎనిమిది సంవత్సరాల్లో అర పైసా సహాయం చేయలేదు.

ఆఖరికి పోయిన సంవత్సరం అక్టోబర్‌లో వరదలు వస్తే.. వరదల్లో హైదరాబాద్‌లో చాలా కాలనీలు జలమయమైతే.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ నుంచి రూ.660కోట్లు పేద ప్రజలకు రూ.10వేల చొప్పున తక్షణ సహాయం కింద అందజేయడం జరిగింది. మోదీని అడిగాం.. గుజరాత్‌లో వరదలు వస్తే ఆగమేఘాల మీద హెలికాప్టర్‌లో పోయినవ్‌.. రూ.1000కోట్లు ఇచ్చి వచ్చిన్‌.. మాకు కూడా ఇవ్వండి అయ్యా అంటే.. ఇప్పటి వరకు కనీసం వెయ్యి పైసలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కానీ వారం తర్వాత హైదరాబాద్‌కు వస్తున్నారంట.. కూకట్‌పల్లి వేదికగా ప్రధాని మోదీని, కేంద్ర నాయకులను, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నరు? ఏం చేయడానికి వస్తున్నరు’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.

దేశ యువత మిలటరీలో అందుకే చేరాలా?
దేశాన్ని రామరాజ్యం చెస్తామని చెప్పి.. రావణకాష్టంలా మారుస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇవాళ దేశంలో ఏ వర్గం సంతోషంగా లేకుండా కులాల మధ్య, మతలా మధ్య పంచాయితీలు పెట్టి.. ఒక మతపిచ్చి పెట్టి దేశాన్ని రావణకాష్టం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఒక వైపు అగ్నిపథ్‌ అనే పథకాన్ని తెచ్చి దేశంలోని యువత పొట్టకొడుతున్నరు. వాళ్లంతా రోడ్లెక్కి ఆందోళన చేస్తా ఉంటే.. దేశ ద్రోహులని వాళ్లను అవమానిస్తున్నరు. ఇక్కడ ఒకాయన కేంద్రమంత్రి ఉన్నడు మోదీ కేబినెట్‌లో. ఆయన అంటడు.. ఈ అగ్నిపథ్‌ పథకం మంచిది. అగ్నిపథ్‌ పథకంలో చేరిన తర్వాత మిలటరీలో బట్టలు ఉతకొచ్చు. కటింగ్‌ చేయొచ్చు. ఎలక్ట్రిషియన్‌ పని చేయొచ్చు. డ్రైవర్‌ పని చేయొచ్చు.. బ్రహ్మాండంగా ఉంటది భవిష్యత్‌ అంటున్నడు.. దాని కోసం దేశ యువత మిలటరీలో చేరాలా? డ్రైవరయ్యేందుకు, బట్టలు ఉతికేందుకు, ఎలక్ట్రిషన్‌ అయ్యేందుకు దేశ యువత మిలటరీలో చేరుతుందా? వాళ్లంతా రోడ్డు మీదకు వస్తే అది పట్టించుకునే మూడ్‌లో లేరు.

పెద్ద నోట్ల రద్దని.. రాత్రికి రాత్రి రద్దు చేస్తే సామాన్యులు తాము బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముల కోసం బ్యాంకుల ముందు చాంతాడంత నిలబడి నిలబడి మూర్చ వచ్చి చచ్చిపోతే, చక్కరచ్చి పడిపోతే పట్టించుకోలేదు. ఆ తర్వాత నాకు 50 రోజుల సమయం ఇవ్వండి అన్నాడనీ, మీరనుకున్న విధంగా చేయకపోతే మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే అన్నడు. మరి 50 రోజుల్లో ఏం మారింది.. 500 రోజులందైంది.. పెద్ద నోట్ల రద్దుతో ఏదో జరుగుతదన్నడు.. నల్లదనం తెస్తా అన్నడు.. ఇవాళ నల్లధనం ఏదయ్యా మోదీ గారు అంటే.. తెల్లముఖం వేసుకున్నడు.. ఒక్కటంటే ఒక్క సమస్య పరిష్కరించే తెలివి లేదు. అగ్నిపథ్‌ అని యువతతో ఆడుకోవడం.. పెద్దనోట్ల రద్దు అని సామాన్యులతో ఆడుకుంటున్నారు’ అంటూ ధ్వజమెత్తారు.

Also Read : ఇంగ్లీష్ మీడియం వినియోగించుకోండి: హరీష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్