కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలో ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టం చేశారు. రైతులు అనవసర అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ 11 జనవరి వరకు డ్రాఫ్ట్ పూర్తవుతుందని వెల్లడించారు. రైతులకు ఏదయినా అభ్యంతరాలు ఉంటే తనకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ లో ఎవరి భూములు కోల్పోరని, రైతులు అనవసర ఆందోళన చెందవద్దని కోరారు. కొత్త మాస్టర్ ప్లాన్ పై ప్రచారం చేసాం..కానీ రైతులు తమకు తెలియదని చెప్పటం కరెక్ట్ కాదన్నారు.
గతంలో రిపొందించిన మాస్టర్ ప్లాన్ లో ఏ రైత భూములు కోల్పోలేదు.. మరి ఇప్పుడు ఎలా కోల్పోతారని కలెక్టర్ ప్రశ్నించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే రైతులు తమకు తెలియచేయాలని, సవరణలు, మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంటుందన్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని, ముసాయిదా డ్రాఫ్ట్ దశలోనే ఉంది.. రైతుల అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు చేస్తామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ మొదటి దశలోనే ఉందని, మాస్టర్ ప్లాన్ లో ఎవరి భూములకు నష్టం జరగదన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కోసమే ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరుగుతోందని, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు.
మాస్టర్ ప్లాన్ వల్ల ఎవరికి నష్టం లేదని, మాస్టర్ ప్లాన్ పై విస్తృత ప్రచారం చేస్తున్నాం, అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఇంకా అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా తనకు తెలియచేయండని కోరారు. తప్పుడు ప్రచారం నమ్మద్దని, రైతులు ఎలాంటీ అపోహలు అనుమానాలు నమ్మద్దన్నారు. రైతులు ఆందోళనలు చేయద్దు. అనవసర ఆందోళనలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ హెచ్చరించారు.