భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆంధ్ర ప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీలో నెలకొన్న పరిణామాలపై కలత చెందిన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 2014 లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బిజెపిలో చేరానని, 2018 లో తనను రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా నియమించారని, 2019 ఎన్నికలకు పది మాసాల ముందు నియమించినా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని, 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను పోటీకి నిలబెట్టానని చెప్పారు. కరోనా సమయంలో తనను తొలగించి సోమును నియమించారని, 2024లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నానని చెప్పారు. కానీ పార్టీలో ప్రస్తుతం పరిస్తితుతులు బాగాలేదని, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పై జీవితాంతం అభిమానంగానే ఉంటానని స్పష్టం చేశారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని ప్రకటించారు. సోము వీర్రాజు ప్రవర్తన బాగాలేకనే పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు చెప్పారు.
2018లో కన్నాను తప్పించి ఆయన స్థానంలో సోము వీర్రాజును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బిజెపి కేంద్ర నాయకత్వం నియమించింది. అప్పటి నుంచీ ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. రెండు మూడు నెలలుగా ఆయన సోము వీర్రాజుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. గత వారం ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీరుపై కూడా కన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్స్ విషయంలో ఆయన కొత్తగా ఏం సాధించారని నిలదీశారు. తన హయంలో నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చిన సందర్భంలో కూడా కన్నా గట్టిగా వ్యతిరేకించారు. కన్నా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం.