Sunday, January 19, 2025
HomeTrending Newsటిడిపికి దరిద్రం పట్టింది: కన్నబాబు

టిడిపికి దరిద్రం పట్టింది: కన్నబాబు

కొడుకు లోకేష్ ను ఓ పెద్ద స్టార్ గా చూద్దామనుకున్న చంద్రబాబుకు నిరాశే ఎదురైందని, అందుకే తండ్రీ కొడుకులు ఇద్దరూ శాపనార్ధాలు పెట్టుకుంటూ యాత్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. సిఎం వైఎస్ జగన్ ను బూతులు తిట్టడమే ఏకైక అజెండాగా వారి యాత్రలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రానికి అసలైన దరిద్రం చంద్రబాబేనని, ఆయన పాలనలో కరువు విలయతాండవం చేసిందని  అలాంటి బాబు జగన్ ను పట్టుకొని దరిద్రం అంటూ మాట్లాడడం దారుణమన్నారు. జగన్ సిఎం అయిన తరువాత సమృద్ధిగా వానలు పడి ప్రాజెక్టు గేట్లు కొట్టుకుని పోయే స్థాయిలో వానలు పడుతున్నాయని… ఇలాంటప్పుడు మరి ఎవరి పాలన దరిద్రం అంటారని కన్నబాబు ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రకు అసలు స్పందనే లేదని అందుకే బూతులకు తెగబడుతున్నారని ఎద్దేవా చేశారు.

సిఎం జగన్ రాష్ట్రానికి అదృష్టమని, తెలుగుదేశం పార్టీకి నిజంగా దరిద్రమేనని కురసాల వ్యాఖ్యానించారు. ముందు రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండమని ఆ పార్టీ కార్యకర్తలే చంద్రబాబుకు సలహా ఇచ్చారంటే మిమ్మని గెస్ట్ ఆర్టిస్టులని మీ వాళ్ళే అంటున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో చూసుకోవాలని సలహా ఇచ్చారు. ప్రజలకు ఏమీ చేయకుండా చివరకు ఎన్నికలు రాగానే ప్రజల చేతిల్లో పదివేల రూపాయలు పెట్టి ఓట్లు అడగడాన్నే దరిద్రం అంటారని చెప్పారు.

లోకేష్ దిగజారి సిఎం జగన్ ను పట్టుకొని ఏక వచనంతో, అవమానకర రీతిలో మాట్లాడుతున్నారని, అసలు తన బతుకేంటో, అతని స్థాయి ఏమిటో ఒకసారి అలోచించుకోవాలన్నారు. లోకేష్ దున్న భాష మాట్లాడుతున్నారని, అసలు కామధేనువు ఎవరో, అన్న ఎవరో, దున్న ఎవరో అందరికీ తెలుసన్నారు కన్నబాబు. ఆంబోతులు, దున్నలు ఏ పార్టీలో ఉన్నాయో అందరికీ తెలుసని మండిపడ్డారు.

మరో నేత అయ్యన్న పాత్రుడు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, అసలు ఆయన బుర్ర లేకుండా అయినా, గంజాయి మత్తులో అయినా ఇలా మాట్లాడి ఉంటారని కన్నబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇదే పద్దతిలో మాట్లాడితే వైసీపీ నేతలు మాట్లాడే మాటలకు మీరు తట్టుకోలేరని టిడిపి నేతలని కన్నబాబు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్