ఓటీటీలో మర్డర్ మిస్టరీ కథలకు .. క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ తరహా కథలను చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అందువల్లనే ఇలాంటి జోనర్లో వెబ్ సిరీస్ లు ఎక్కువగా రూపొందుతున్నాయి. ఈ జోనర్లో నిర్మితమైన సినిమాలు కూడా ఓటీటీ ద్వారా విడుదలవుతున్నాయి. అలా నిన్న ‘నెట్ ఫ్లిక్స్’ వచ్చిన సినిమానే ‘జానే జాన్’. కరీనా కపూర్ ప్రధానమైన పాత్రను పోషించగా, ముఖ్యమైన పాత్రలలో జైదీప్ అహ్లావత్ – విజయ్ వర్మ నటించారు.
ఈ సినిమాలో కరీనా కపూర్ ‘మాయ డిసౌజా’ పాత్రలో కనిపిస్తుంది. కూతురు ‘తార’ ఆలనా పాలన ఆమె ఒంటరిగా చూసుకుంటూ ఉంటుంది. ఇల్లు గడవడం కోసం ఆమె ఒక కేఫ్ లో పనిచేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమె జీవితంలోకి మళ్లీ అజిత్ మాత్రే ఎంటరవుతాడు. అతను ఆమె మాజీ భర్త. ఆయన పద్ధతి నచ్చకపోవడం వలన ఆమె విడిపోయి చాలా కాలమవుతుంది. గతాన్ని మరిచిపోవడానికి ఆమె ప్రయత్నిస్తున్న సమయంలోనే, అతను మళ్లీ ఆమె జీవితాన్ని టచ్ చేస్తాడు.
మాజీ భర్త మళ్లీ కనిపించిన దగ్గర నుంచి మాయ డిస్టబ్ అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అతణ్ణి హత్య చేస్తుంది. ఆ హత్య విషయం బయటపడకుండా ఉండటం కోసం ఆమె ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి పరిస్థితులకు ఎదురవుతాయి? ఆ పరిణామాలను ఆమె ఎలా ఎదుర్కొంటుంది? అనే ఆసక్తికరమైన అంశాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. హంతకురాలిగా మాయ .. ఈ కేసును డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ గా విజయ్ వర్మ నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి.