Saturday, July 27, 2024
HomeTrending NewsTDP: హస్తినలో లోకేష్... వారం రోజులుగా ఏం చేస్తున్నట్టు?

TDP: హస్తినలో లోకేష్… వారం రోజులుగా ఏం చేస్తున్నట్టు?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రిమాండ్ ను పొడగిస్తూ ఏసిబి కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ను చాలెంజ్ చేస్తూ వేసిన రివ్యూ పిటిషన్ + క్వాష్ పిటిషన్ ఏపి హై కోర్టు కొట్టివేసింది. శాసనసభలో తెలుగు తమ్ముళ్ళు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఈ రోజు విజిల్స్ వేస్తూ…సభ కాలాన్ని హరించివేస్తున్నారు. టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తాయని పేరున్న పత్రికలు…సభలో బాలకృష్ణ వెకిలి చేష్టలపై రాయటం పక్కన పెట్టి పనికిమాలిన వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. అక్కడ ఏం చేస్తున్నారో పార్టీ శ్రేణులకు అర్థం కావటం లేదు. ఇప్పటివరకు బాబును జైల్లో పెట్టిన తర్వాత మద్దతిచ్చినవారిని కలిశారు. బీజేడీ, శివసేన, హర్యానా డిప్యూటీ సీఎం వంటివారు లోకేష్ కు సంఘీభావం తెలియజేశారు. మొదటి రెండురోజులు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. చంద్రబాబును అరెస్ట్.. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని వివరించారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది. పని ముగించుకొని మూడు రోజుల్లో వస్తారనుకుంటే వారం రోజులు గడిచిపోయినా ఢిల్లీలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. రాజకీయంగా ఎవరితోనూ చర్చలు జరపడం లేదు. ప్రధాని మోదీ లేదా హోంమంత్రి అమిత్ షాలను కలిసే ప్రయత్నం చేయలేదని టిడిపి అనుకూల మీడియాలో వస్తోంది. లోకేష్ ఢిల్లీలో పార్టీ అంతర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారని టిడిపి ఎంపీల ద్వారా తెలిసింది. కేసుల్లో పీకల్లోతు ఇరుక్కుపోయామని లోకేష్ ఆందోళన చెందుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు కోసం లోకేష్ విఫలయత్నం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే బిజెపి నాయకత్వం నుంచి అలాంటి సిగ్నల్స్ రావటం లేదు. పార్లమెంటు వద్ద కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిసిన టిడిపి ఎంపీలు కూడా ఇదే విషయం ప్రస్తావించారని తెలిసింది. మోడీ, అమిత్ షా లను ఒప్పించేందుకు ఆర్.ఎస్.ఎస్ ద్వారా చేసే ప్రయత్నాలకు గడ్కరి సహకారం కోరినట్టు… గడ్కరి స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది.

ఈ రోజుతో పార్లమెంటు సమావేశాలు కూడా ముగిశాయి. దీంతో జాతీయ స్థాయి నేతలను కలవటం కూడా సాధ్యం కాదు. అన్ని పార్టీలు ఇప్పుడు రాబోయే ఎన్నికలపై దృష్టి సారించాయి. అందరు స్వరాష్ట్రాలకు పయనం అవుతున్నారు. బాబుకు బెయిల్ తీసుకురావటానికి… కేసుల నుంచి బయటపడేందుకు లోకేష్ ఏం మంత్రాంగం చేస్తున్నారో అంతు చిక్కటం లేదని తెలుగు తమ్ముళ్ళు వర్రీ అవుతున్నారు.

బాబు అరెస్టుతో ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించేందుకు వెళ్ళారు. అక్కడ నేతల ఓదార్పు తప్పితే ఎవరు తీవ్రంగా స్పందించలేదు. ఇన్నాళ్ళు చంద్రబాబు అన్నీ తానై వ్యవహరించారు. సంకట సమయంలో ఢిల్లీలో లాబీయింగ్ చేయటం లోకేష్ తో కావటం లేదని అవగతం అవుతోంది.

ఏపీలో లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బ్రాహ్మణిని తెరపైకి తెస్తున్నారు. రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్