Wednesday, April 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిజమే సారూ! మా చావు మేము చస్తున్నాం!

నిజమే సారూ! మా చావు మేము చస్తున్నాం!

నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీ మెయిన్ గేట్ ఎదురుగా టీచర్లు ఒక డిమాండుతో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఈలోపు వర్షం మొదలయ్యింది. ముఖ్యమంత్రి కారు కనిపించగానే టీచర్లు మరింత గట్టిగా నినదిస్తున్నారు. లోపలికి వెళ్ళబోయిన ముఖ్యమంత్రి బయటే ఆగి- ఆ బృందంలో నలుగురిని ఇటు రమ్మనండి అన్నారు. వారు వచ్చాక- అయ్యవార్లు ఇలా వర్షంలో తడుస్తూ రోడ్డున పడడం బాగోలేదు.

మీ సమస్య ఏమిటో వివరిస్తూ వినతి పత్రం ఇవ్వండి- అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తా- పాఠాలు చెప్పే మీరు దయచేసి ఇలా రోడ్డెక్కకండి అని వారిని శాంతింపజేశారు. హైదరాబాద్ లో ధర్నా చౌక్ ను తొలిగించే సందర్భంలో వరవరరావు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఒక వ్యాసం రాశారు. ఒకప్పుడు నిరసన గళాన్ని వినేవారు. నిరసన తెలియజేయడానికి వేదికలయినా ఉండేవి అని బాధపడ్డారు.
——————–

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వాలను నడపడానికి తమ ప్రతినిధులుగా ప్రజలు కొంత మందిని ఎన్నుకుంటారు. ప్రజల కోసం, వలన, చేత, పేరిట ప్రతినిధులు పాలన చేస్తుంటారు. ప్రజల సేవలో తరించే ప్రతినిధులు అక్కడక్కడా ఉంటారు. వారిని దివిటీ పెట్టి, దుర్భిణి వేసి వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత, అవసరం ప్రజల మీదే ఉంటుంది. ఎన్నిక అయిపోయి గెలిచిన ప్రతినిధికి అసంకల్పితంగా, అప్రయత్నంగా, అవలీలగా కొన్ని వచ్చి చేరతాయి. గన్ మెన్, తుపాకులు, వాహనం, డ్రైవర్, పి ఏ , పి ఎస్, ఓ ఎస్ డి, వంటవాడు, క్యాంప్ ఆఫీస్, హెడ్ ఆఫీస్, పార్టీ ఆఫీస్, లోకల్ ఆఫీస్…ఇలా అల వైకుంఠపురములో ఆ మూల సౌధంబు దాపల మందార వనాంతరాల్లోకి వెళ్లిపోయే మన ప్రతినిధిని మనం పట్టుకోవడానికి అనేక గెరిల్లా యుద్ధ విద్యలు వచ్చి ఉండాలి. అంత ప్రయత్నంతో మన ప్రతినిధిని పట్టుకుని-

“అయ్యా బాబూ! ఉచిత బియ్యం ఇది వరకు అయిదు కేజీలు ఇచ్చేవారు. ఇప్పుడు రెండు కేజీలే ఇస్తున్నారు. అసలే కరోనా కాలం. మళ్లీ అయిదు కేజీలు ఇప్పించండి” అని ప్రాధేయపడితే-
“మేమిచ్చేది ఇంతే. తింటే తినండి. లేకపోతే చావండి”
అని కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తిలా కత్తి గుచ్చుకునేంత కటువుగా సమాధానం చెప్పవచ్చు. దీన్ని అహంకారంగా, బాధ్యతారాహిత్యంగాచూడాల్సిన పనిలేదు.

ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ- విషాదం బొమ్మా బొరుసుగా ఉన్న వైరుధ్యం అదే. ఓటరుకు ఓటు వేసే వరకే విలువ. తరువాత ప్రజలకు విలువ ఉండదు. ఎన్నికయిన ప్రతినిధికే విలువ.

అయినా- చస్తే చావండి అన్నది వేదాంత పరిభాషగా చూస్తే- మంత్రి ఉమేష్ కత్తిలో కత్తిలాంటి వేదాంతి మన గుండెల్లోకి గుచ్చుకుంటూ దిగబడతాడు!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్