బంగారంపై చాలామందికి విపరీతమైన వ్యామోహం ఉంటుంది. అందువల్లనే దానికి అంత డిమాండ్ ఉంటుంది. విదేశాల నుంచి బంగారం అక్రమంగా రవాణా జరగడానికి కారణం కూడా ఇదే. అందువల్లనే చాలా ముఠాలు .. పెద్ద మనుషుల ముసుగులో చెలామణి అవుతున్నవారు ఈ అక్రమ రవాణాలో తమ పాత్రను చాలా జాగ్రత్తగా పోషిస్తూ ఉంటారు. ఇక ఎవరి వాటా వారికి చేరుతూ ఉంటుంది గనుక, ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించే అధికారులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు.
అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన మలయాళ సినిమానే ‘కాసర్ గోల్డ్’. ఈ మధ్యనే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా చూడొచ్చునా? అంటే .. చూడొచ్చు .. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ‘దుబాయ్’ నుంచి స్మగ్లింగ్ రూట్లో కొంత బంగారం కేరళ ప్రాంతానికి చేరుతుంది. అయితే ఆ బంగారాన్ని సొంతం చేసుకోవడానికి ఇద్దరు స్నేహితులు ప్లాన్ చేస్తారు. ఆ విషయంలో వాళ్లు సక్సెస్ అవుతారు. ఒకరు విలాసవంతమైన జీవితం కోసం బంగారంపై ఆశ పెంచుకుంటే, మరొకరు ఒక ఆపదలో నుంచి బయటపడటం కోసం ఆ బంగారంపై ఆశ పడతాడు.
అయితే ఎవరైతే ఆ బంగారాన్ని ‘దుబాయ్’ నుంచి తెప్పించారో, వాళ్ల ముఠా ఈ స్నేహితుల కోసం వెదకడం మొదలు పెడుతుంది. అవినీతి పరుడైన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ముఠా ఈ పనిపై పంపిస్తుంది. వాళ్ల బారి నుంచి ఆ స్నేహితులు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు .. వాళ్లు ఎదుర్కొనే ప్రమాదాలు .. చివరికి ఆ బంగారం ఎవరి సొంతమవుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ కథ నడుస్తుంది. మొదటి నుంచి చివరి వరకూ ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.