Kcr Fight : రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రం వైఖరిని నిలదీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్దం చేయాలన్నారు.
తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్రం వైఖరి పట్ల ఏం చేయాలో పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం చేతులెత్తయడంతో.. ఈ విషయాన్ని రైతులకు వివరించాలని చెప్పారు. వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచించారు. ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రిని కలవనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిపోయిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం అవకాశం ఇవ్వాలని కోరుతూ ఈ బృందం ఢిల్లీలో కోరనుంది.
సమావేశ వివరాలను వెల్లడించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గతంలో వడ్లు అన్నీ కొంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు .. కానీ కేంద్రం రాత పూర్వకంగా ఇచ్చిన వాటికే దిక్కులేదు .. నోటి మాటలకు విలువ ఎక్కడుంది. ఈ విషయం మీద కేంద్రాన్ని నిలదీసేందుకు ఢిల్లీకి వెళ్తున్నాం. కేంద్ర మంత్రులతో పాటు, ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ను కోరనున్నాం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో గ్రామాల వారీగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలపై వివిధ రకాలుగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది
టీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశంలో వివిధ సమస్యలపై సుధీర్ఘంగా చర్చించాం. కేంద్ర ప్రభుత్వం తరపున పార్లమెంటులో కేంద్ర మంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారు .. ఎఫ్ సీ ఐ వారిది .. గోదాంలు వారివి .. రైళ్లు వారివి .. వాళ్ల బియ్యం వాళ్లు తీసుకెళ్లకుండా రాష్ట్రం పంపలేదని చెప్పడం పూర్తిగా అవగాహనా రాహిత్యం.
బీజేపీ నేతలవి పిచ్చి ప్రేలాపనలు .. అవగాహన లేని వాదనలు. వ్యవసాయాధికారులు రైతుబంధు విషయంలో చేసిన సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరస్కరించారు. శాసనసభ సాక్షిగా రైతుబంధును ఎట్టి పరిస్థితులలోనూ ఆపేదిలేదని ఇచ్చిన ప్రకటన మేరకు కట్టుబడి ఉన్నానని కేసీఆర్ గారు వెల్లడించారు. ఒక ప్రతిపాదన వచ్చింది కాబట్టి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో చర్చించడం జరిగింది .. తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే తీసుకుంటుంది. ఏడేండ్ల మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశంలోని ఏ రంగం కూడా బలపడింది లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఏ పథకంలోనూ కేంద్ర ప్రభుత్వ అణా పైసా లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర నిధులతో నిర్మించుకున్న ప్రాజెక్టు అని కేంద్ర మంత్రే పార్లమెంటులో వెల్లడించారు.