ఇల్లు కట్టించి ఇచ్చినా…ఆడబిడ్డ పెండ్లికి చేయూత అందించినా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ CC నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కల్వకుంట్ల తారక రామారావు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, MLC సురభి వాణిదేవి లతో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు కు సంబంధించిన పత్రాలను అందజేశారు. ముందుగా పొట్టి శ్రీరాములు నగర్ లో ఇటీవల నిర్మించిన శ్రీ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి CC నగర్ వరకు మంత్రి KTR కు మహిళలు, హారతులు, బోనాలతో, పోతురాజ్ ల నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు కట్టి చూడు..పెండ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అనలేదని, ఈ రెండు ఎంతో కష్టంతో కూడుకున్నవని పేర్కొన్నారు. కానీ మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు.

అంతేకాకుండా పేదింటి ఆడపడుచుల పెండ్లికి ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వమే అందిస్తుందని, దేశంలోని ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలేదని స్పష్టం చేశారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలను కేటాయించగా 11 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. మిగిలిన ఇండ్ల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తిచేసి లబ్దిదారులకు అందజేస్తామని చెప్పారు. కొందరు దళారులు మీకు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పుతారని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజలు సొంత ఇంటిలో ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఆలోచనతో లబ్దిదారులపై ఒక్క పైసా భారం లేకుండా ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను లబ్దిదారుల సమక్షంలోనే అర్హులను గుర్తించి లాటరీ పద్దతిలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఇండ్లను అమ్మినా, కొన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెన్షన్ లు, 24 గంటలు ఉచితంగా విద్యుత్ సరఫరా, KCR కిట్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కలెక్టర్ శర్మన్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, కార్పొరేటర్ లు కుర్మ హేమలత, కొలన్ లక్ష్మి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *