Monday, May 20, 2024
HomeTrending Newsకెసిఆర్ స్టాలిన్ మంతనాలు

కెసిఆర్ స్టాలిన్ మంతనాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఈ రోజు సమావేశమయ్యారు. చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ స్టాలిన్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునఃప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్‌ కోరినట్టు తెలుస్తోంది.

ఇరువురు సీఎంలు రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటున్న అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వివిధ అంశాలపై ఇటీవల స్టాలిన్ కేంద్రంపై పోరాటం ప్రకటించారు. ఆయా అంశాల్లో కలిసి పోరాటం చేద్దామని దక్షిణాది ముఖ్యమంత్రులకూ లేఖలు రాశారు. ఆయా అంశాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేయాలని ఇరువురు అనుకున్నట్లుగా తెలుస్తోంది.

అదే సమయంలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య దేశ రాజకీయాలపైనా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి విషయంలో చర్చలు జరిగినట్లుగా టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రకటించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలదే బలమైన శక్తి అని…ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతాయని వినోద్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం స్టాలిన్ కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. కాంగ్రెస్‌కు కటిఫ్ చెప్పి ఆయన ప్రాంతీయ పార్టీల కూటమిలోకి వస్తారా లేదా అన్నది ముందు ముందు తేలే అవకాశం ఉంది. గతంలోనూ కేసీఆర్ ప్రాంతీయ పార్టీల కూటమి కోసం ఓ సారి చెన్నైలోనే స్టాలిన్‌ను కలిశారు.

కేసీఆర్ కుటంబ సమేతంగా స్టాలిన్‌ను కలిశారు. డీఎంకే ఎమ్మెల్యే, స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు అయిన ఉదయనిధి … మంత్రి కేటీఆర్‌తో సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించారు. వివిధ అంశాలపై వారు తమ అభిప్రాయాలను కలబోసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయనిధి రాజకీయ రంగంలోనూ బీజేపీపై విమర్శలు చేయడంలో తనదైన ప్రత్యేకత చూపిస్తూంటారు. డీఎంకే యూత్ వింగ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. డీఎంకే పార్టీ నిర్మాణ అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి పనికొచ్చే అంశాలపై కేటీఆర్ మరింత సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు చెన్నైలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ గవర్నర్ నరసింహన్‌ను కేసీఆర్ పరామర్శించారు.

Also Read : రేపు స్టాలిన్ తో కేసియార్ భేటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్