Sunday, May 19, 2024
HomeTrending Newsవక్రమార్గం పట్టించే దుష్ట పన్నాగాలు: కేసిఆర్ ఆవేదన

వక్రమార్గం పట్టించే దుష్ట పన్నాగాలు: కేసిఆర్ ఆవేదన

ప్రగతి శీల విధానంతో… ప్రజలంతా మనవాళ్ళే అనుకొని.. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడా మా బిడ్డే అనుకొనేది గొప్ప ప్రభుత్వం అవుతుందని కానీ ప్రజలను మత పిచ్చితో విడదీసి, ద్వేషాన్ని రగిలిస్తే, ఆ మంటలు ఎవరిని దహిస్తాయో ఆలోచించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయానికి ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీఎం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. దేశాన్ని వక్రమార్గం పట్టించే దుష్ట పన్నాగాలు జరుగుతున్నాయని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

బొగ్గు గనులతో గొప్ప ఆదాయ, ఉద్యోగ వనరుగా, సింగరేణి సిరుల కల్పవల్లిగా, తెలంగాణ కొంగు బంగారంగా నిలిచిన గడ్డ కొత్తగూడెం-ఇల్లందు గడ్డ అని కేసిఆర్ అభివర్ణించారు. క్రియాశీలంగా, ప్రగతి శీలంగా ఆలోచించే ఈ ప్రాంతం కమ్యూనిస్టు విప్లవ భావాలతో విరాజిల్లే గడ్డ అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత సమాజమే దేవాలయంగా భావించి కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని సిఎం అన్నారు. సర్వజనుల హితాన్ని కాంక్షించి కార్యక్రమాలు చేసుకుంటున్నామని తెలిపారు.

కొత్తగూడెం జిల్లాలో ఉన్న 481 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామానికి 10 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి ద్వారా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు మున్సిపాలిటీలు కొత్తగూడెం- పాల్వంచ మున్సిపాలిటీలకు ఒక్కోదానికి 40 కోట్లు, ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీలకు చెరో 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. కొత్తగూడెం ప్రాంతంలో మైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చిందని, దాన్ని పూర్తి స్థాయి కాలేజీగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు.  మిగిలిన రాష్ట్రాల కంటే జీఎస్డీపీ గ్రోత్, పర్ క్యాపిటా లాంటి అంశాల్లో మిగిలిన రాష్ట్రాలకంటే ముందంజలో ఉన్నామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్