బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చిన కథానాయికలలో కీర్తి సురేశ్ ఒకరు. బాలనటిగా మలయాళ సినిమాల నుంచి తన ప్రయాణాన్ని మొదలెట్టిన కీర్తి సురేశ్, ఆ తరువాత కథానాయికగా కోలీవుడ్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముద్దుగా .. బొద్దుగా ఉన్న ఈ బ్యూటీకి చాలామంది అభిమానులుగా మారిపోయారు. పెద్దగా సమయం తీసుకోకుండానే ఆమె ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో ఇక ఇక్కడ ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ రేసులో చేరటానికీ .. టాప్ త్రీ లో ఒకరిగా నిలవడానికి కూడా ఆమె ఎక్కువ సమయం తీసుకోలేదు. అయితే ‘మహానటి’ తరువాత నాయిక ప్రధానమైన సినిమాలను చేయాలనే ఆమె నిర్ణయం కొంతవరకూ ఆమె గ్రాఫ్ దెబ్బతినడానికి కారణమైంది. అలాగే బాగా సన్నబడటం కూడా అభిమానుల అసహనానికి కారణమైంది. ఆ పొరపాట్లను సరిచేసుకునేలోగా ఆమె కొంత మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు.
అలాంటి కీర్తి సురేశ్ కి సర్కారువారి పాట’ కొంతవరకూ ఊరటనిచ్చింది. అయితే ఆ తరువాత ఆమె ఒప్పుకున్న సినిమాల్లో ‘ దసరా’ తప్ప మరో ప్రాజెక్టు లేదు. ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నప్పటికీ, అందులో ఆమెది చెల్లెలు పాత్ర మాత్రమే. ఇవి కాకుండా ఆమె తమిళంలో రెండు సినిమాలు మాత్రమే చేస్తోంది. టాలీవుడ్ కి సంబంధించిన కొత్త ప్రాజెక్టులలో మాత్రం ఆమె పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. ఎక్కువ గ్యాప్ రాకుండా … వరుస సినిమాలతో ఆమె స్పీడ్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.