మరోసారి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పష్టం చేశారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే కేశినేని భవన్ లో కూర్చుంటానని చెప్పారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం అవసరమైతే గొంగళిపురుగునైనా ముద్దు పెట్టుకుంటానని చెప్పారని, తానూ కూడా విజయవాడ అభివృద్ధి కోసం గొంగళి పురుగు గానీ, ఎలుగు బంతి గానీ, ముళ్ళపందిని కూడా ముద్దడుతానని వ్యాఖ్యానించారు. మొండితోక బ్రదర్స్ మంచి చేస్తున్నారు కాబట్టి అదే విషయాన్ని చెప్పానని, దానిపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని, ప్రజా వేదిక కూల్చినప్పుడు గట్టిగా మాట్లాడానని… అంతే కానీ నీచ రాజకీయాలు చేయబోనని అన్నారు. తన మనసుకు నచ్చింది మాట్లాడతానని తేల్చి చెప్పారు.
నిన్న నందిగామ నియోజకవర్గంలో పర్యటించిన కేశినేని.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ లపై ప్రశంశలు కురిపించారు. నాలుగేళ్ళుగా వారిని తాను గమనిస్తున్నానని అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. రాజకీయం అనేది ఎన్నికల వరకే పరిమితమైతే బాగుంటుందని సూచించారు. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. నాని వ్యాఖ్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు.
టిడిపి నేతల తీరుపై కేశినేని మండిపడ్డారు. గెలిస్తే ఎమ్మెల్యే, ఎంపి… లేకపోతే నియోజకవర్గ ఇన్ ఛార్జ్… జీవితాంతం నేను, నా కుటుంబమే అంటే పార్టీ నష్టపోతుందని హెచ్చరించారు.