Sunday, January 19, 2025
HomeTrending Newsసిక్కుల్లో రాజుకుంటున్న ఖలిస్థాన్‌ డిమాండ్

సిక్కుల్లో రాజుకుంటున్న ఖలిస్థాన్‌ డిమాండ్

సిక్కుల్లో ఖలిస్థాన్‌ కావాలన్న బలమైన కోరిక ఇంకా నిలిచే ఉన్నదని, దాన్ని ఎవరూ అణచివేయలేరని ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, వారిస్‌ పంజాబ్‌ దే సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ తెలిపారు. కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన అతని అనుచరుడు లవ్‌ప్రీత్‌ తుఫాన్‌ను విడుదల చేయాలంటూ అమృత్‌పాల్‌ అనుచరులు, పలువురు మద్దతుదారులు అమృత్‌సర్‌ సమీపంలోని అంజలా పోలీస్‌ స్టేషన్‌పై దాడికి దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

లవ్‌ప్రీత్‌ను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అమృత్‌పాల్‌ చేసిన హెచ్చరికకు తలొగ్గిన పంజాబ్‌ ప్రభుత్వం శుక్రవారం అతడిని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్‌ మీడియాతో మాట్లాడారు. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌తో ఖలిస్థాన్‌ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. తమది నిషేధించాల్సిన సంస్థ ఎంతమాత్రం కాదని పేర్కొన్న ఆయన.. పోలీసులు తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన కారణంగానే గురువారం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. తాను హింసావాదిని కాదని, అయితే తన వెనుక ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. కొందరు నా వెనుక బీజేపీ ఉండి ఆడిస్తున్నదని అంటుండగా, మరికొందరు పాకిస్థాన్‌ ప్రోద్భలంతోనే ఇదంతా చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. అయితే నా వెనుక వీరెవ్వరూ లేరని అమృత్‌పాల్‌ సింగ్‌ చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్