Saturday, January 18, 2025
HomeTrending Newsఖమ్మం ఖిల్లా... ముగ్గురు మంత్రులకు సవాల్

ఖమ్మం ఖిల్లా… ముగ్గురు మంత్రులకు సవాల్

ఖమ్మం లోక్ సభ స్థానం నిలబెట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. రాష్ట్రమంతా ఒకవైపు ఉంటే ఖమ్మం ఓటర్లు మరోవైపు మొగ్గు చూపుతారు. తొలుత కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఉన్న పోటీ 1998 నుంచి కాంగ్రెస్ ఇతర పక్షాల మధ్య కేంద్రీకృతం అయింది.

2024 లోక్ సభ బరిలో కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురాం రెడ్డి, బిజెపి నుంచి తాండ్ర వినోద్ రావు, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి నామ నాగేశ్వరరావు ఉన్నారు.

దీని పరిధిలో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, అశ్వారావు పేట్, కొత్తగూడెం, సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగూడెం(సిపిఐ) మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు.

ఖమ్మం లోక్ సభ స్థానంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ కంచుకోట అనుకోగా అభ్యర్థి ప్రకటనలో సాగతీత, అభ్యర్థి ఎంపిక పార్టీ గెలుపునకు చేటుగా మారాయని హస్తం నేతలే అనుకుంటున్నారు. టికెట్ కోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమర్క భార్య నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కుమారుడు యుగంధర్ చివరి వరకు యత్నించారు.

చర్చోపచర్చల తర్వాత అధిష్టానం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి ఖరారు చేసింది. దీంతో వైరి వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. భట్టి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తన మిత్రుడు మండవ వెంకటేశ్వర్ రావుకు కూడా దక్కకపోవతంతో తుమ్మలకు కమ్మ సంఘంలో ముఖం చెల్లటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి నామ నాగేశ్వరావు టికెట్ ఖరారు అయిన మరుక్షణం నుంచి నియోజకవర్గంలో చురుకుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రెండుసార్లు చుట్టివచ్చిన నామా పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తూ మున్డుకువేలుతున్నారు. ఇటీవల పార్టీ అధినేత కెసిఆర్ రాకతో బీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఉందని అంటున్నారు.

బిజెపి నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. జిల్లా మొదటి నుంచి వామపక్షాల ఖిల్లా కావటంతో కమల దళం అంతగా పట్టు సాధించలేదని చెప్పుకోవచ్చు. ముక్కోణపు పోటీలో బిజెపి అభ్యర్థి చీల్చే ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ఎవరికీ నష్టం కలిగిస్తుందో చూడాలి.

ఖమ్మం లోక్ సభ స్థానాన్ని మొదట్లో వెలమలు గెలుచుకున్నా కాలక్రమంలో కమ్మ సామాజికవర్గం చేతుల్లోకి వెళ్ళింది. పార్టీ ఏదైనా కమ్మ వారే ఖమ్మం ఎంపి అని నానుడి ఇక్కడ ఉంది. బీఆర్ఎస్ హయంలో మొదటిసారి(2014) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన తరువాతి పరిణామాల్లో(2019) నామా నాగేశ్వర్ రావుకు ఇవ్వాల్సి వచ్చింది.

కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకునేందుకు కమ్మ సామాజికవర్గం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా చివరకు రెడ్డిల వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో ఈ వర్గం సహాయ నిరకారణ చేపట్టిందని విశ్వసనీయ సమాచారం. విపక్షమైనా బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరావుకు మద్దతు తెలపాలని కమ్మ సామజికవర్గంలో ముఖ్యులు నిర్ణయించినట్టు తెలిసింది.

దీంతో ఇప్పుడు ఖమ్మంలో రెడ్డి vs కమ్మ పోటీగా ఎన్నికల పోరు మలుపు తిరిగింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అంతో ఇంతో అవకాశం ఉన్న సీటుగా ఖమ్మం వార్తల్లో నిలుస్తోంది. కాంగ్రెస్ ను గెలిపించటం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులకు సవాల్ గా మారింది. అభ్యర్థి ఖరారు ఆలస్యం కావటంతో ముగ్గురు మంత్రులు తలోదిక్కు హడావిడిగా ప్రచారం ప్రాంభించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్