Kherson : ఉక్రెయిన్ పై వారం రోజులుగా క్షిపణుల వర్షం కురిపిస్తున్న రష్యా తూర్పు ప్రాంతంలో ఇప్పటికే ఆధిపత్యం సాధించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ప్రధానమైన నగరం ఖర్కివ్ ను రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఖర్కివ్ నగరంలోకి ప్రవేశిస్తున్న రష్యా కొన్ని ప్రాంతాల్లో పౌరుల నుంచి నిరసన ఎదుర్కొంటోంది. రేపు ఉదయంలోగా ఖర్కివ్ నగరం తమ ఆధీనంలోకి వస్తుందని రష్యా ఆర్మీ ప్రకటించింది.
రష్యా బలగాలు ఖేర్సన్ నగరాన్ని ఆక్రమించాయని నగర మేయర్ ఇగోర్ కొలిఖేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ శత్రుదేశ సైనికుల పాలయ్యాయన్నారు. నల్ల సముద్రం ద్వారా ఉక్రెయిన్ వచ్చే వారికి ముఖ్యమైన ద్వారం లాంటిది ఖేర్సన్ నగరం. మూడు లక్షల జనాభా ఉన్న ఈ నగరం రష్యా దాడులతో కూలిపోయిన భవనాలు, బాంబు దాడులతో పొగ కమ్ముకొని స్మశానంగా తయారైందని నగర మేయర్ నిర్వేదంగా అన్నారు.
మరోవైపు దేశ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా సేనలు కదులుతున్నాయి. కీవ్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోకి రష్యా బలగాల భారీ కాన్వాయ్ వేంచేసింది. ఉక్రెయిన్ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో ఈ రోజు రాత్రికి రష్యా బలగాలు నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. వైమానిక దాడులతో విరుచుకు పడుతున్న రష్యా… ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక, రక్షణ స్థావరాలు లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఈ రోజు రాత్రి కీవ్ నగరంపై శత్రు దేశం రష్యా భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపించే అవకాశం ఉందని, పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ ప్రభుత్వం హెచ్చరించింది.
Also Read : బెలారస్ పై ఆంక్షలు