Sunday, January 19, 2025
HomeTrending Newsపుణ్య క్షేత్రాల అభివృద్ధి ప్రభుత్వ సంకల్పం : మంత్రి కొప్పుల

పుణ్య క్షేత్రాల అభివృద్ధి ప్రభుత్వ సంకల్పం : మంత్రి కొప్పుల

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి జరగడం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి కొప్పుల దంపతులకు అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రికి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. మంత్రి తో పాటు స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారు, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, ఈ.ఓ కృష్ణ ప్రసాద్ తోపాటు పలువురు ఉన్నారు.

ప్రజల ఆకాంక్ష మేరకు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలంలో భీమారం నూతన మండల ఏర్పాటు చేశామని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారన్న ఆయన.. వేములవాడలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. సమైక్యాంధ్రప్రదేశ్ లో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయాన్ని ఇప్పటికే అభివృద్ధి చేయగా… పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నానన్నారు. వేములవాడ, బాసర, ధర్మపురి, కాళేశ్వరం లాంటి ఆలయాలకు ప్రభుత్వ ప్రత్యక్ష నిధులను మంజూరు చేస్తూ అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచి, ఒక మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల తెలిపారు. -కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని ఇరిగేషన్ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని గర్వంగా చెప్పారు. మూడు కోట్లకుపైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నామన్న ఆయన… దేశంలో అత్యధికంగా ధాన్యం పండించే పంజాబ్ రాష్ట్రాన్ని కూడా మనం అధిగమించామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు, మున్సిపల్, గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేసి పరిపాలనను మరింత చేరువ చేశారని ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్