Sunday, January 19, 2025
HomeTrending Newsసూచనలు పాటించాలి: కృష్ణబాబు

సూచనలు పాటించాలి: కృష్ణబాబు

Be Alert: భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలను ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు, ఏపీ విద్యార్ధులు అందరూ తప్పక పాటించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు సూచించారు. రొమేనియా సరిహద్దులకు వస్తే అక్కడినుంచి ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించిన విషయం వాస్తవమేనని, అయితే సాయంత్రం మరో ప్రకటనలో తొందరపడి సరిహద్దులకు రావొద్దని చెప్పిందని, దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో వివిధ అధికారులతో ఒక టాస్క్ ఫోర్సు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈటాస్క్ ఫోర్సు కమిటీలో రాష్ట్ర టిఆర్అండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణ బాబు,ఎపి డైరీ డెవలప్మెంట్ ఎండి డా.ఎ.బాబు, ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాశ్,రాష్ట్ర రైతు బజారుల సిఇఓ శ్రీనివాసులు, ఏపి ఎన్ఆర్టి సొసైటీ సిఇఓ కె.దినేష్ కుమార్, ప్రత్యేక అధికారి (ఇంటర్నేషనల్ సహకారం) గితేశ్ శర్మ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కె.కన్నబాబు,అందరు జిల్లా కలక్టర్లు సభ్యులుగా ఉన్నారు.

ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న ఈ టాస్క్ ఫోర్స్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణబాబు మాట్లాడుతూ…. రాష్ట్రానికి చెందిన విద్యార్థులను తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా సిఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని, స్వదేశానికి వచ్చే విద్యార్ధులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని వెల్లడించారు.

నేడు రెండు విమానాలు భారతీయులను తీసుకుని బయల్దేరాయని, వీటిలో మొదటి విమానం  ఈ సాయంత్రం ముంబై; రెండవది రేపు ఉదయం ఢిల్లీకి చేరుకుంటుందని వివరించారు. మొదటి ఫ్లైట్ లో 9, రెండవ దానిలో 13 మంది ఏపీ విద్యార్థులు ఉన్నట్లు ఎంబసీ వారు మనకు సమాచారం ఇచ్చారని, అయితే తాము వారితో మాట్లాడినప్పుడు ఈ 22 మంది మన రాష్ట్రానికి చెందినవారు చెందినవారు కాదని కృష్ణబాబు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం తరఫున…. రిజిస్ట్రేషన్ శాఖ ఐజి గా పనిచేస్తున్న కస్టమ్స్ శాఖ అధికారి రామకృష్ణ ను ముంబైలో; ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, అడిషనల్ కమిషనర్ హిమాంషు శుక్లాలను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మనవారిని రిసీవ్ చేసుకునేందుకు ప్రత్యేక అధికారులుగా నియమించామని తెలిపారు.

విద్యార్థులు ఎలాంటి ఆవేదన చెందవద్దని, ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయం ఇచ్చే సూచనలు పాటించాలని తొందరపడి సరిహద్దుల వద్దకు రావొద్దని కోరారు. రష్యా సేనలు సామాన్య ప్రజల నివాస ప్రాంతాలపై దాడులు చేయడం లేదని, అందువల్ల అక్కడున్న మనవారికి తీవ్రమైన ముప్పు ఉండకపోవచ్చని కృష్ణబాబు అభిప్రాయపడ్డారు. దగ్గరలోని రెడ్ క్రాస్ శిబిరాలకు,  అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్ల వద్దకు వెళ్లి ఉండాలని సూచించారు. వయసు దృష్ట్యా సాహసాలు చేసేందుకు కొంతమంది విద్యార్ధులు పూనుకునే ప్రమాదం ఉందని, అలాంటి ప్రయత్నాలు చేయవద్దని ఈ దిశగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు నచ్చజెప్పాలని కృష్ణబాబు సూచించారు.

Also Read : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్