Monday, June 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆ మూడు రోజులూ.... ఒకేరాశిలో ఐదు గ్రహాలు

ఆ మూడు రోజులూ…. ఒకేరాశిలో ఐదు గ్రహాలు

No Need of Worry:  రేపు జోతిషశాస్త్రానికి సంబంధించి, అరుదైన పంచగ్రహ కూటమి ఆవిష్కారం కాబోతోంది. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం గం. 10.37 నిమిషాలకు శుక్రుడు, అదేరోజు మధ్యాహ్నం గం. 2.22 నిమిషాలకు చంద్రుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నారు. ఇప్పటికే ఆ  రాశిలో.. కుజ, బుధ, శని గ్రహాలు ఉన్నాయి. కొత్తగా శుక్ర, చంద్ర గ్రహాలు కూడా మకరరాశిలోకి చేరడం వల్ల.. ఈ అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది.

దీనికితోడు గోచారం ప్రకారం ప్రస్తుతం.. కాలసర్ప యోగం నడుస్తోంది. అన్నిరకాల చెడు యోగాల కన్నా ఈ కాలసర్ప యోగం చాలా భయంకరమైనదని, ఊహించని విపత్తులు సంభవిస్తాయని వైదిక జోతిష శాస్త్రం చెబుతోంది. ఒకవైపు కాలసర్ప యోగం, మరోవైపు పంచగ్రహ కూటమి.. ఈ రెండు పరిణామాలు మానవాళికి మేలు చేస్తాయా? కరోనా వంటి ఉత్పాతాలు మళ్లీ కబళిస్తాయా? అన్న సందేహాలు, ఆందోళనలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ప్రస్తుతం నడుస్తున్న కాలసర్ప యోగం.. అపసవ్యమైనది. అంటే కేతువు మొదలు రాహువు దాకా ఉన్న రాశుల్లో ఏడు గ్రహాలు అంటే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలూ వున్నాయి. జోతిష శాస్త్రం ప్రకారం ఇటువంటి అపసవ్య కాలసర్ప యోగం దోషరహితం. దీనివల్ల ఎటువంటి విపత్తూ సంభవించదు.

ఇక పంచగ్రహ కూటమి విషయానికి వస్తే, ఇది కాస్త అరుదైనదే. అయితే, ఈ మధ్యనే మనకు చతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ఈఏడాది జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో గోచార చక్రంలోని మకరరాశిలో చతుర్గ్రహ (రవి, చంద్ర, బుధ, శని) కూటమి ఏర్పడింది. ఆతర్వాతి రోజు నుంచి ఈనెల 27వ తేదీ దాకా మకరరాశిలో కుజ, శుక్ర, శని గ్రహాల కూటమి కొనసాగుతోంది. 27వ తేదీన పంచగ్రహ కూటమి ఏర్పడి…. మార్చి ఒకటో తేదీ సాయంత్రం గం.4.31 నిమిషాలకు చంద్రుడు కుంభరాశిలోకి వెళ్లడంతో మళ్లీ చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది.

త్రిగ్రహ, చతుర్గ్రహ కూటములు ఏర్పడిన ఏ సందర్భంలోనూ మానవాళికి నేరుగా పెనుముప్పేమీ వచ్చిపడలేదు. ఇప్పుడు కొత్తగా ఐదు గ్రహాలు జతకట్టడం వల్లగానీ, ఆతర్వాత నాలుగు గ్రహాలే మిగలడం వల్ల కానీ పెద్దగా విపత్తులేమీ వచ్చి పడే అవకాశం లేదు. పైగా ఈ గ్రహాల మధ్య యుతి (రెండు గ్రహాల మధ్య 30-20′ అంతరం ) కూడా పరిశీలిస్తే.. ఈ ఐదూ ఒకేసారి ప్రభావం చూపే అవకాశాలు లేవు.

కాబట్టి, ప్రస్తుత అపసవ్య కాలసర్ప యోగంలో ఏర్పడే పంచగ్రహ కూటమి వల్ల, మానవాళికి ముంచుకొచ్చే ముప్పేమీ ఉండదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే, జన్మకుండలిలోని జాతక దోషాలను ఈ గోచార గ్రహాలు ప్రభావితం చేయకుండా.. ఆయా రాశుల వారు, తమకూ సూచించిన గ్రహశాంతులు జరుపుకుంటే సరిపోతుంది.

-పి. విజయ్ కుమార్

ఇవి కూడా చదవండి:

https://idhatri.com/weekly-horoscope-in-telugu-february-20-2022-to-february-26-2022/

RELATED ARTICLES

Most Popular

న్యూస్