తెలుగు తెరపై 70వ దశకంలో విజృంభించిన కథానాయకులలో కృష్ణంరాజు ఒకరు. 60వ దశకంలో చివరిలోనే ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటికీ, హీరోగా అవకాశాలను పొందడానికీ .. స్టార్ డమ్ ను సంపాదించుకోవడానికి ఆయనకి కొంత సమయం పట్టింది. ఒక వైపున తనకి సీనియర్లైన ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లు బరిలోనే ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకునే తాను సినిమాల్లోకి వచ్చినట్టుగా కృష్ణంరాజు చెప్పారు కూడా. ఇక తనతోటి వారైన కృష్ణ – శోభన్ బాబుల నుంచి కూడా కృష్ణంరాజు గట్టి పోటీని ఎదుర్కోవలసి వచ్చింది.
తాను ఏ తరహా పాత్రలకి సెట్ అవుతాననే విషయం అనుభవంలోకి రావడానికి ఆయనకి కొంత సమయం పట్టింది. అప్పుడే ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి తగిన మొరటు పాత్రల దిశగా అడుగులు వేశారు. రౌడీయిజంలోనే హీరోయిజం చూపించే పాత్రల ద్వారా ఆయన మాస్ ఆడియన్స్ కి చేరువ అయ్యారు. అవకాశాలు రావు .. సృష్టించుకోవాలి అన్నట్టుగా ఆయన సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ‘కృష్ణవేణి’ .. ‘అమరదీపం’ .. ‘భక్త కన్నప్ప’ .. ‘తాండ్రపాపారాయుడు’ వంటి సొంత సినిమాలు ఆయన స్థాయిని అమాంతం పెంచుతూ వెళ్లాయి.
కృష్ణంరాజు అంటే నిలువెత్తు నిండుదనం .. ఆయన ధరించడం వలన ఆ పాత్రలకే ఒక రాజసం వచ్చేది. కృష్ణంరాజు తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలనే చేస్తూ వచ్చారు. ఒక స్థాయిని దాటి డాన్సులలో ఆయన ముందుకు వెళ్లేవారు కాదు .. అలాగే చిల్లర కామెడీ చేయడానికి కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. కామెడీ తప్పనిసరి అయితే అది ఆ పాత్ర మొరటుదనానికి దగ్గరగా ఉండేలా చూసుకునేవారు. అందువలన కృష్ణంరాజు అంటే హుందాదనంతో .. రాజసంతో కూడిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ .. ‘త్రిశూలం’ .. ‘తాండ్రపాపారాయుడు’ .. ‘విశ్వనాథ నాయకుడు’ వంటి సినిమాలే కళ్లముందు కదలాడతాయి.
ఇక ఆయన వచ్చిందే భూస్వాముల ఇంటి నుంచి .. శ్రీమంతుల కుటుంబం నుంచి. అయినా ఆయన ఏనాడూ ఇతరుల పట్ల చులకనగా మాట్లాడిన దాఖలాలు కనిపించవు. ఎవరినీ ఎప్పుడూ విమర్శించ లేదు. తన తోటి హీరోలతో కలిసి మల్టీ స్టారర్ లు చేయడానికి ఎంతమాత్రం వెనుకాడని వారాయన. తెరపైనే కాదు బయటకూడా కృష్ణంరాజు నవ్వుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ నవ్వు ఎంత గంభీరంగా ఉంటుందో .. అంతే నిర్మలంగా ఉంటుంది. అందువల్లనే ఆయన గొప్ప నటుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా అందరి మనసులను గెలుచుకున్నారు. తెలుగు తెర రారాజుగా నిలిచిపోయారు.
Also Read :