Tuesday, February 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆనందయ్య అమృత వైద్యం

ఆనందయ్య అమృత వైద్యం

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర ఒక ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య కరోనా విరుగుడుకు తయారు చేసిన మందులో వాడుతున్న వనమూలికలు ఇవి.

 1. అల్లం
 2. తాటి బెల్లం
 3. తేనె
 4. నల్ల జీలకర్ర
 5. తోక మిరియాలు
 6. పట్టా
 7. లవంగాలు
 8. వేప ఆకులు
 9. నేరేడు చిగుళ్లు
 10. మామిడి చిగుళ్లు
 11. నేల ఉసిరి
 12. కొండ పల్లేరు
 13. బుడ్డ బుడస ఆకులు
 14. పిప్పింట ఆకులు
 15. తెల్లజిల్లేడు పూల మొగ్గలు
 16. ముళ్ళ వంకాయలు

ఇంగ్లీషు వాడు వచ్చాక మొదట మనదయిన మాతృ భాష పరమ మొరటుగా అనిపించింది. తరువాత మనవయిన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వేషం, ఆహారపుటలవాట్లు పరమ అనాగరికమయినవిగా అనిపించాయి. చివరికి మనం ఇక్కడే పుట్టి, ఇక్కడే చస్తున్నా ఇంగ్లీషువాడిలా పుట్టి- ఇంగ్లీషు వాడిలానే చావాలనుకునేంతగా ప్రభావితమయ్యాం.

సంస్కృత ఆంధ్ర కన్నడ ప్రాకృత భాషల్లో పండితుడు, విఖ్యాత విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ “రాయలనాటి రసికత” పేరుతో సుదీర్ఘమయిన వ్యాసం రాశారు. విజయనగర సామ్రాజ్యంలో జనం అభిరుచులు, భాష, వేషం, తిండి, అలంకారాలు, ఉత్సవాలను అనేక గ్రంథాల ఆధారాలతో వివరించారు. నిజానికిది పరిశోధన వ్యాసం. అందరూ రాయలేరు. ఆ రోజుల్లో ఒక్కో రుతువుకు కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు చేసుకునే వారు. ఇంటిల్లిపాది వెన్నెల్లో భోంచేయడానికి డాబా మీద ప్రత్యేకమయిన ఏర్పాట్లు ఉండేవి. జాజి, మల్లె, తీగ సంపెంగ తీగలు ఆ డాబా దాకా అల్లుకుని ఉండేవి. పారిజాతం చెట్టు లేని ఇల్లు ఇల్లే కాదు. నీళ్లల్లో అల్లం, జీలకర్ర, మిరియాలు ఉడికించి కాచి వడపోసిన పానీయం, చెరుకు రసం, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పోపు వేసిన మజ్జిగ, యాలకులు, మిరియాలు దంచి వేసిన బెల్లం పానకం…ఇలా భోజనానికి ముందు- భోజనం తరువాత వారు తాగిన రసాలను చెబుతూ పోతే పెద్ద రస గ్రంథమవుతుంది.

ఇక మెయిన్ కోర్సులో తిన్న ఐటమ్స్ తెలుసుకుంటే మనకు కళ్లు తిరుగుతాయి. సైడ్ డిష్ లుగా నంజుకోవడానికి పెట్టుకున్న వడియాలు, అప్పడాలు, వడలు, మిరపకాయలు, ఉల్లి గడ్డలు చెబితే నోరెళ్లబెడతారు. అలా ఎలా తిన్నారని మనం ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. నోటికి దొరికింది తినకుండా- రుతువు, పగలు, రాత్రి, వయసు, సందర్భాన్ని బట్టి ఏది తినాలో అదే తినేవారు. ఏది తాగాలో అదే తాగేవారు. పెద్దన వర్ణించిన దానిమ్మ రసం వట్టి వర్ణన కాదు- ఆయన రోజూ తాగిన ఫలరసమే అని రాళ్లపల్లి నిరూపించారు. ఇప్పుడు మనం ఏమి తింటున్నామో? ఎలా తింటున్నామో? ఎవరికి వారు తేల్చుకోవాలని మనకే వదిలేశారు.

ఒక్కో భౌగోళిక ప్రాంతానికి కొన్ని ఆహారపుటలవాట్లు కాలగతిలో దానికవిగా ఏర్పడతాయి. దక్షిణ భారతదేశంలో వంటిళ్లలో తప్పనిసరిగా వాడే అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, యాలకులు, లవంగాలు, కేసరి, పచ్చ కర్పూరం, మెంతులు…అన్నీ ఔషధ గుణాలున్నవే. రోగనిరోధక శక్తికి ఉపయోగపడేవే. ఇలాగే మనం సంప్రదాయంగా చేసుకుంటున్న వడపప్పు, పానకం, గుగ్గిళ్లు, తులసి తీర్థం, గసగసాల పాయసం, సగ్గుబియ్యం పాయసం అత్యంత ఆరోగ్యకరమయినవే. పేడ నీళ్ల కళ్ళాపి, గుమ్మాలకు ఎర్రమట్టి పసుపు, ద్వారానికి మామిడి, అరటి, వేప మండలు, సాంబ్రాణి పొగ, వేపాకు పొగ మంచివే. మట్టి కుండలు మంచివే. ఇనుప బాణళ్లు మంచివే.

ఒక ఆచారం స్థిరపడడానికి ముందు ఎన్నో ప్రయోగాలు జరిగి ఉంటాయి. మానవ నాగరికతకు ఉపయోగపడని ఆచారాలు వాటంతటవే తెరమరుగు అయిపోతాయి. మన ఆహారం విషయంలో మాత్రం ఆచారాన్ని ద్వేషించాలన్న గుడ్డి సిద్ధాంతంతో నక్కకు నాగలోకానికి దేనికీ చెందకుండా రెంటికీ చెడ్డ రేవళ్లమయ్యాం.ఆయుర్వేదాన్ని కూడా అలాగే గుడ్డిగా ద్వేషించి రూపుమాపాము.

కృష్ణ పట్నం ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య తయారు చేసిన మందులో మూలికలేమిటో చెప్పాడు. తయారీ విధానం చెప్పాడు. వాడుతున్నవారికి ఫలితం కనపడుతోంది. సైడ్ ఎఫెక్ట్స్ లేనే లేవు. ఉచితం. కరోనా కారు చీకట్లో కాంతి రేఖలా జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఆనందయ్య ఉచితంగా పంచే ఆనందాన్ని మన లోలోపలి ఇంగ్లీషు ఒప్పుకోదు. మన మెదడులో ఇంగ్లీషు వేదం అన్న మాటను అసలు వినలేదు. ఆయుస్సును పెంచే ఆయుర్వేదాన్ని మన ఇంగ్లీషు కళ్లు చూడలేవు. మనకు క్రయోజనిక్ ట్యాంకర్లో ఫ్రెష్ గా ఎయిర్ లిఫ్ట్ అయి వెంటిలేటర్ గొట్టం ద్వారా వచ్చిన ఆక్సిజన్ సహిత రెమ్ డిసీవర్ ఎంత డిసీవ్ చేసినా- అదే ముద్దు.

అయ్యో! సత్తెకాలపు ఆనందయ్యా! నీ ఉచిత ఆయుర్వేద వైద్యం ఎందుకూ కొరగానిది అని ఈ ఆధునిక మహోన్నత భారతీయ ఇంగ్లీషు మెదళ్లు నిరూపించకుండా వదిలి పెడతారా?

మేము రోగిని కాదు- రోగాన్నే ప్రేమిస్తాం. రోగాన్ని కాదు- మందులనే ప్రేమిస్తాం.

అయ్యా! ఆనందయ్యా!

డి విటమిన్ బిళ్ల వేసుకునే వేళయ్యింది. సి విటమిన్ బిళ్ల ఎక్కడుందో వెతుక్కునే వేళయ్యింది. డోలో 650 చేతికి దొరికింది. రెమ్ డిసివిర్ భోజనం సిద్ధమయ్యింది. అజిత్రోమైసిన్ గొంతెత్తి పిలుస్తోంది. వంటింట్లో ఆక్సిజన్ సిలిండర్ వంటపొయ్యి సిలిండర్ తో శ్రుతి కలిపింది. వెంటిలేటర్ వాయులీనం విషాదగీతం పాడుతోంది.

ఉంటాం ఆనందయ్యా!

నువ్ సార్థక నామధేయుడివి. ఆనందం తియ్యగా అయ్యగా ఉన్నవాడివి. అందరికీ ఆనందం పంచుతున్నవాడివి. మా ఆనందం నీ ఆనందంగా అనుకుంటున్నవాడివి. నీకు అభినందనలు. నీ  నిస్వార్థ వైద్యానికి సాష్టాంగ ప్రణామాలు. కోటికొక్కరు ఇంకా నీలాంటివారు ఉండబట్టే వర్షాకాలంలో నాలుగు చినుకులయినా నేల రాలుతున్నాయి. నీ ఆయుర్వేద వైద్య విధానాన్ని మా అత్యాధునిక సశాస్త్రీయ అతి మానుష ఇంగ్లీషు మనసులు అంగీకరించవు. ఈ లోకం గుర్తింపుతో నీకు నిమిత్తం లేదు. నువ్ ఆనందయ్యవు. అరుదయిన మూలికల ఆనందయ్యవు. మౌలికమయిన ఆనందయ్యవు. నీ వైద్యం ఇలాగే పదికాలాలు ఆనందామృతం కావాలని కోరుకుంటూ…

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్