Saturday, January 18, 2025
HomeTrending Newsబాసర విద్యార్థులకు కేటీఆర్ భరోసా

బాసర విద్యార్థులకు కేటీఆర్ భరోసా

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థులతో సంభాషించిన మంత్రి కేతారకరామారావు. విద్యార్థులతో లంచ్ చేసిన కేటీఆర్ ఆ తర్వాత వారితో ముచ్చటించారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ లో ఉన్న సమస్యలు మరియు వివిధ అంశాల పైన తనకు పూర్తి సమాచారం, అవగాహన ఉందన్న కేటీఆర్, ట్రిపుల్ ఐటీ బాసర అభివృద్ధి తో పాటు ఇక్కడి విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం ఐటి ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహకారంతో, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమన్వయం చేసుకొని ట్రిపుల్ ఐటిని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ లో టీ హబ్ సెంటర్ ఏర్పాటుతోపాటు, మినీ స్టేడియం, అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు, డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ , విద్యార్థులకు లాప్టాప్ లు అందజేయడం, మోడర్న్ క్లాస్ రూముల వంటి అంశాల పైన తాను పూర్తి బాధ్యత తీసుకొని వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కేటీఆర్ తెలిపారు. విద్యార్థులతో తన హాస్టల్ అనుభవాలను, విద్యార్థిగా తన అనుభవాలను పంచుకున్న కేటీఆర్, కోర్సులు పూర్తయిన తర్వాత ఇన్నోవేషన్ వంటి రంగాల్లో విజయం సాధించేందుకు విద్యార్థులు ఇప్పటినుంచి సిద్ధం కావాలని కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు-

• మళ్లీ నవంబర్ లో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు ఇవ్వడానికి వస్తాను. అప్పటివరకు ఆడిటోరియంను మరింత అభివృద్ధి చేయాలి. కొత్త మౌలిక వసతులు కల్పించే బాద్యత నేను తీసుకుంటాను. మళ్లీ నవంబర్ లో వస్తాను.

• బాసర ట్రిపుల్ ఐటీలో డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాము. పిల్లలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము. క్యాంపస్ లో మినీ టీ హబ్ ఏర్పాటుచేస్తాము. విద్యార్థులు తయారుచేసిన ఉత్పత్తులతో ప్రతీ సంవత్సరం వారం రోజులు ఇన్నోవేషన్ వారోత్సవాలు జరగాలి. అమెరికాలోని MIT లాగా బాసర ట్రిపుల్ ఐటీ మారాలి. MIT ల్యాబ్ నుంచి వచ్చిన కంపెనీలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయి.
• బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్నోవేషన్ ల్యాబ్ -మిని టీ హబ్ ఐటీ, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేస్తాము. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తాం.

• నవంబర్ లో అందరికి ల్యాప్ ట్యాప్ లు ఇస్తాము. 3 కోట్ల రూపాయలతో మిని స్టేడియం ఏర్పాటుచేస్తాము. ఆరు నుంచి ఎనిమిది నెలల లోపు అది పూర్తవుతుంది. 1000 కంప్యూటర్ లతో ఆధునిక డిజిటల్ ల్యాబ్ ఏర్పాటుచేస్తాము. 50 అదనపు మోడర్న్ క్లాస్ రూంలు, మోడర్న్ ఫర్నీచర్ తో ఏర్పాటుచేస్తాము.

• క్యాంపస్ మేయింటనెన్స్ అనేది సమష్టి బాధ్యత. బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి. నెలకొక్కసారైనా శ్రమదానం చేపట్టండి.

• బోధన ఇంకాస్త మెరుగు పడాలని విద్యార్థులు కోరారు. కొత్త టెక్నాలజీ పై కోర్సులను ప్రవేశపెట్టమని అడిగారు. ఈ న్యూ ఏజ్ కోర్సులను బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశపెట్టాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరుతున్నాను.
• ఆరునెలలకు ఒకసారి ట్రిపుల్ ఐటీకి వస్తాను. విద్యార్థులు కూడా మాతో కలిసి రావాలి. ఉద్యమస్పూర్తితో కలిసి పనిచేసి దీన్ని మోడల్ క్యాంపస్ గా మారుద్దాం.
• ఆందోళన చేస్తున్నప్పుడు ప్రతీ రోజు పేపర్లు, టీవీల్లో చూశాను. రాజకీయాలకు అతీతంగా స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ సహకారంతో మీ సమస్యలను మీరు పరిష్కరించుకున్నారు.
• మీరు ఎంచుకున్న పద్దతి నాకు నచ్చింది. గాంధీగారి సత్యాగ్రహ పద్దతిలో శాంతియుతంగా వానలో కూడా బయట కూర్చోని కొట్లాడిన పద్దతి నాకు చాలా నచ్చింది. చాలా గొప్పగా వారం రోజులు మంచి స్పూర్తితో పోరాడారు. కేవలం సమస్యల కోసం ఆందోళన చేసిన మీరు అందులో రాజకీయ పార్టీలకు తావు ఇవ్వకపోవడం నచ్చింది
• సర్కార్ దృష్టిని ఆకర్షించడానికే ఆందోళన చేస్తున్నామని చెప్పారు. అందుకు అభినందనలు చెపుతున్నాను
• సమస్యలు అపరిష్కృతంగా ఉంటే ప్రజస్వామికంగా పోరాడొచ్చు.
• బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులదే. తెలంగాణలోని అద్భుత ప్రతిభ కల విద్యార్థులే ఇక్కడ చదువుకుంటున్నారు.
• బాసర ట్రిపుల్ ఐటీలో సీటు ఇప్పియ్యాలని నా రాజకీయ జీవితంలో ఎన్నో పైరవీలు వచ్చాయి. కాని మెరిట్ ఉంటేనే సీటు వస్తుందని చెప్పాను.


• ఎన్నో ఆశలతో బాసర ట్రిపుల్ ఐటీ కి వచ్చి ఉంటారు. కాని ఆశించిన స్థాయిలో వసతులు లేకపోవడంతో బాధపడ్డారు.ఎన్.ఐ.టీ, ఐఐటీ లకు ధీటుగా ట్రిపుల్ ఐటీని తయారుచేయమని విద్యార్థులు కోరారు. ప్రస్తుతం ఉన్న వసతులను ఇంకా మంచిగా చేయమన్నారు.
• ప్రొఫెసర్ వెంకటరమణ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన తండ్రి రామకృష్ణయ్య విద్యావేత్త. ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో ఉస్మానియాలో చాలా కార్యక్రమాలు అయ్యాయి. వెంకటరమణ స్థాయికి ట్రిపుల్ ఐటీ వీసీ చాలా చిన్న అంశం.ఆయన, సతీశ్ వచ్చినంక కొంత మార్పు వచ్చింది. ఇంకా జరగాల్సిన పని చాలా ఉంది.
• నేను హాస్టల్ లలో ఉన్నవాన్ని. నాకు హాస్టల్ కష్టాలు నాకు బాగా తెలుసు.
• అయితే కొంత సమయం ఇవ్వండి. ఇక్కడ పాతుకుపోయిన మనుషుల్ని, వ్యవస్థల్ని అర్థంచేసుకోవడానికి సమయం పడుతుంది.
• మెస్ టెండర్లు కొత్తగా పిలిచినం. కాని అంతగా స్పందన రాలేదు. మరొకసారి పిలుస్తున్నాము. చిత్తశుద్దితో మా ప్రయత్నం చేస్తున్నాము.
• చిన్నతనం నుంచే డాక్టర్, ఇంజనీర్ కావాలని ఏదో ఒక ఉద్యోగం వస్తుందని పిల్లలకు నూరిపోస్తరు.బాగా చదువుకుంటే మంచి భర్త వస్తడని ఆడపిల్లలకు చెపుతరు.నువ్వు వేరే వాళ్ల దగ్గర ఎందుకు ఉద్యోగం చెయ్యడం. పది మందికి ఉద్యోగాలు ఇచ్చేలా నువ్వే ఎందుకు మారవు అని చెప్పే సంస్కృతి మనదేశంలో లేదు.
• రిస్క్ తీసుకోవద్దు. అప్పు ఉండదు. తాహతుకు మించి ఆలోచించవద్దు. ఎక్కువ ఆలోచించవద్దున్న మాట చిన్నప్పటి నుండి చెపుతరు. తక్కువ ఆలోచించాలి. ఒకరి కింద పనిచెయ్యాలనే చెపుతారు. సొంతంగా పదిమందికి ఉద్యోగాలు ఇచ్చేలా నేనేందుకు కాకూడదన్న ఆలోచన మనకు రానియ్యలేదు.
• ఇన్ స్టా గ్రాం, ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లు మనకు అర్థం కాని బ్రహ్మపదార్థాలు ఏ మాత్రం కాదు. కాని వీటిని మన భారతీయులు మాత్రం కనిపెట్టలేదు. 140 కోట్ల మంది భారతీయులు ఎవరి కిందనో పనిచెయ్యాలా?
• అమెరికా నుంచి ప్రపంచాన్ని ఆకర్షించే ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నాయి. మనం గానుగ ఎద్దులలాగా పనిచేద్దమా? ఇలాంటివి కొత్తవి ఏదన్నా కనుకొందామా?
• ఇన్నోవేషన్ అంటే ఎవరికి అర్థం కానిది కాదు. మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం. గూగుల్ కనిపెట్టుడు మాత్రమే ఇన్నోవేషన్ కాదు.
• ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నాము.
• సిరిసిల్లలో చిన్నారి చేసిన ఇన్నోవేషన్ ను చెప్పిన కేటీఆర్.
• వరిసాగు కలుపు తీసే యంత్రాన్ని తయారుచేసిన విద్యార్థి గురించి చెప్పిన కేటీఆర్.
• చింతకింది మల్లేశం తన తల్లి కష్టాలను చూడలేక ఆసు యంత్రాన్ని కనిపెట్టిండు.

ఈ సమావేశంలో ప్రసంగించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మరియు ఇంద్రకరణ్ రెడ్డి. త్రిబుల్ ఐటీ రాష్ట్రంలోని గ్రామీణ పేద విద్యార్థుల పాలిట ఒక వరమని ఇక్కడ చదివితే జీవితాల్లో స్థిరపడతామన్న బలమైన విశ్వాసం తల్లిదండ్రులకు ఉన్నదని తెలిపారు. విద్యార్థులు తమ సమస్యల కోసం ఆందోళన చేసిన సమయంలో పలుమార్లు వారితో మాట్లాడమని, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వాటి పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత మూడు నెలల కాలంలో ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో గుణాత్మకమైన మార్పు కనిపిస్తున్నదని తెలిపిన మంత్రులు, భవిష్యత్తులోనూ నిబద్ధతతో విద్యార్థులకు మరిన్ని ఉన్నంత ప్రమాణాల విద్య అందించడంతోపాటు క్యాంపస్ ప్రాంగణంలో మౌలిక వసతుల కల్పనను ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని తెలిపారు.

Also Read : ఆదిలాబాద్ లో ఐటి పార్క్ – మంత్రి కేటిఆర్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్