తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బిజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కే తారకరామారావు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు తెలిపారు. టీఎస్ పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నందుకు వీరిద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటయిందని.. అయితే ఈ వాస్తవాలు అన్నిటినీ పక్కనపెట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్ లు తెరలేపారని కేటీఆర్ అన్నారు.
ఇప్పటికే వీరు తమ తెలివి తక్కువ ప్రకటనలు, మతిలేని మాటలతో ప్రజల్లో చులకన అయ్యారని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో కోవిడ్ సందర్భంగా పదివేల కోట్ల వ్యాక్సీన్ కుంభకోణం జరిగిందని, వేల కోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తిక్క వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని అన్నారు. తెలివి తక్కువతనంలో రేవంత్ తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
టీఎస్ పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రల వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉందని కేటిఆర్ హెచ్చరించారు. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారని, చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు, వాళ్ల కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయన్నారు.
తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా యువత తమ పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని ఈ సందర్భంగా రాష్ట్ర యువతకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందని కేటీఆర్ తెలిపారు. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలను, ప్రచారాన్ని నమ్మువద్దని విజ్ఞప్తిచేశారు.