Sunday, January 19, 2025
HomeTrending Newsచేనేత సమస్యలపై కేంద్రమంత్రికి కేటిఆర్ లేఖ

చేనేత సమస్యలపై కేంద్రమంత్రికి కేటిఆర్ లేఖ

తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి కేంద్రం చేసిందేమి లేదని మంత్రి,తెరాస వర్కింగ్ ప్రెసిడెండ్ కె. తారక రామారావు అన్నారు. టెక్స్ టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం,చేపట్టాల్సిన చర్యలపైన కేంద్ర టెక్స్ టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి కేటీఆర్ లేఖ రాశారు. వ్యవసాయం తరువాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగంపై మోడీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తతను ఉన్నదని తన లేఖలో కేటీఆర్ ఎండగట్టారు. శుష్క వాగ్దానాలు–రిక్త హస్తాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ తెలంగాణ నేతన్నల కడుపు కొడుతుందని మండిపడ్డారు. తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు వల్లె వేసే అసత్యాలు మాని తెలంగాణ నేతన్నకు సహాయం చేస్తే మంచిదని హితవు పలికారు. నిజానికి తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి, చేనేత కార్మికులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నయా పైసా అదనపు సాయం చేయలేదని ఆ లేఖలో కేటీఆర్ ఆరోపించారు.

వ్యవసాయం తరువాత దేశంలో అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న టెక్స్ టైల్ రంగ ప్రస్తుత దుస్థితికి కేంద్ర ప్రభుత్వ మతిలేని విధానాలే కారణమన్నారు కేటీఆర్. తెలంగాణ టెక్స్ టైల్ – చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారానికి సంబంధించిన వివరాలను తన లేఖలో కేటీఆర్ పొందుపరిచారు. నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు నేతన్నల బాగు కోసం ఉద్యమించిన తాము, అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామన్నారు. భారతీయ ఆత్మకు ప్రతీక అయిన ఎన్నో రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే మోడీ ప్రభుత్వం టెక్స్ టైల్ – చేనేతరంగంపై కూడా కక్ష కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఆ రంగం బాగు కోసం ఏ మాత్రం ఆలోచింకుండా చేనేతపైన జియస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటు నేతన్నల పొట్టగొడుతున్నదని విమర్శించారు.

ఈ సందర్భంగా కేంద్ర జౌళీ, టెక్స్ టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి మంత్రి కేటీఆర్ పలు తన లేఖ ద్వారా తీసుకువచ్చారు.

దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రం సహాయం ఎక్కడ?

మొన్న తెలంగాణకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో పేర్కొన్న మెగా టెక్స్ టైల్ పార్క్ ఎక్కడ ఉందో తెలంగాణ ప్రజలకు చెప్పాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. సూమారు 1552 కోట్ల రూపాయల తెలంగాణ ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో కేంద్రం తరుపున కనీసం మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని కోరితే, ఇప్పటివరకు స్పందించని బీజేపీ ప్రభుత్వం మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. టెక్స్ టైల్ రంగంలోని ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్యంతో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు సహాయం చేయాలని లెక్కలేనన్నీ సార్లు కోరినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు అనేక చిన్న దేశాలు టెక్స్ టైల్ రంగంలో మనకంటే ఎక్కువగా వృద్ధిని నమోదు చేస్తున్నాయన్న కేటీఆర్, ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాల లేమినే కారణమన్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంతో పోటి పడేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైబర్ టూ ఫ్యాషన్ మాడల్ లో ఎర్పాటు చేస్తున్న కాకతీయ టెక్స్ టైల్ పార్కులో ప్రపంచ టెక్స్ టైల్ దిగ్గజాల్లో ఒకటైన యంగ్ వన్ కంపెనీ పెట్టుబడులు పెట్టిన సంగతిని కేటీఆర్ గుర్తుచేశారు. ఇంతటి జాతీయ ప్రాధాన్యత కలిగిన మెగా టెక్స్టైల్ పార్క్ కి కేంద్రం సహకారం అందించాలని కోరారు.

సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు ఎటూ పోయింది?

రాష్ట్రంలోనే అత్యధిక పవర్ లూమ్ మగ్గాలు ఉన్న సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరితే.. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు. కాంప్రహెన్సివ్ పవర్ లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కింద సిరిసిల్లలో మెగా పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తే ఇంతవరకు అతీగతీ లేదన్నారు. సుమారు 26,000 మంది పవర్ లూం కార్మికుల ఆర్థిక భవిష్యత్తు కోసం మోడీ సర్కార్ చేసింది ఏం లేదన్నారు. కాని నేతన్నలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో నేతన్నల కోసం వీవింగ్ పార్క్, అపెరల్ పార్క్ తో పాటు కామన్ ఫెసిలిటీ సెంటర్ లను సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాలజీ ఎక్కడ?

యాదాద్రి, గద్వాల, నారాయన్ పేట్, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్ వంటి జిల్లాల్లో అత్యంత నైపుణ్యం కల సుమారు 40,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి,గద్వాల,నారాయణపేట,ఇక్కత్, గొల్లబామ వంటి చీరలకు తెలంగాణ నెలవుగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ రాష్ర్ట విభజనలో ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లినందున అదే ఇన్ స్టిట్యూట్ ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం స్పందిచలేదని కేటీఆర్ విమర్శించారు. దీంతో పాటు ఇక్కడి నేతన్నల ఆదాయాన్ని పెంచడంతోపాటు వారి భవిష్యత్తు తరాలకు చేనేత కళను అందించాలంటే ఈ సంస్థ అత్యవసరం అనే విషయాన్ని ఎన్ని సార్లు చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదన్నారు. హైదరాబాద్ నగరంలో నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం నుంచి స్పందన లేదన్నారు కేటీఆర్.

15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయాలి

జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(NHDP)లో భాగంగా తెలంగాణలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తిని మోడీ సర్కార్ బుట్ట దాఖలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.

5. చేనేత పైన జిఎస్టీ రద్దు చేయాలి, టెక్స్ టైల్స్ పైన జియస్టీ తగ్గించాలి

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖాదీ వస్త్రాలపై కూడా పన్ను విధించిన దుర్మార్గపు ప్రభుత్వం బిజేపీనే అన్నారు కేటీఆర్. జీఎస్టీతో పన్ను పోటుతో నేతన్నల నడ్డి విరుస్తున్న కేంద్ర అరాచక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న నిరసన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకోనైనా టెక్స్ టైల్ ఉత్పత్తులపై జియస్టీ పన్ను తగ్గిండం, ముఖ్యంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలోని చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈ అగస్టు 7తేదిన జరిగే జాతీయ చేనేత దినొత్సవం నాటికి ఈ జియస్టీ పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

6. పవర్ లూం మగ్గాల అప్ గ్రేడేషన్ ముచ్చట ఏమైంది?
రాష్ట్రంలోని పవర్లూమ్ మగ్గాల అప్‌గ్రేడేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 50% నిధులను భరించేందుకు సిద్ధంగా ఉన్నా, ఇందుకు సంబంధించిన కేంద్రం నిధుల కోసం కేంద్రాన్ని కోరితే స్పందన లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణలోని మరమగ్గాల అప్ గ్రేడేషన్ కొసం వేంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర టెక్స్ టైల్ శాఖకు మంత్రులు మారుతున్నారే కాని తెలంగాణ విజ్ఞప్తులకు మాత్రం సానుకూల స్పందన రావడం లేదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ నేతన్నల తరుపున తాను లేవనెత్తిన ఈ అంశాలన్నింటిపై టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో సైతం నిలదీస్తారని కేటీఆర్ తెలిపారు. కేవలం రాజకీయాల కోసం మాత్రమే తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులుగా వస్తున్న కేంద్ర మంత్రులు, ఇక్కడి నేతన్నల ఈ న్యాయమైన డిమాండ్ లపై సానుకూల ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి నేతన్నల బాగు కోసం పనిచేయాలన్నారు. తెలంగాణ టెక్స్ టైల్-చేనేత రంగానికి చేస్తున్న సహాయం ఏమైనా ఉంటే, అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాటికి ప్రకటించాలన్న కేటీఆర్, లేకుంటే బీజేపీ నేతలను తెలంగాణ నేతన్నలు నిలదీస్తారని కేటీఆర్ హెచ్చరించారు. నోటి మాటలు కాదు-నిధుల మూటలు ఇవ్వండి, ప్రకటనలు కాదు, పథకాలు రావాలని… తెలంగాణ టెక్స్ టైల్, చేనేత రంగానికి ప్రోత్సాహం కావాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్